పి.ఆర్.ఎస్. ఒబెరాయ్ కన్నుమూత... ఈయన గురించి తెలుసుకోవాల్సిందే!
భారత హాస్పిటాలిటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఒబెరాయ్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (94) తుదిశ్వాస విడిచారు.
By: Tupaki Desk | 14 Nov 2023 8:58 AM GMTభారత హాస్పిటాలిటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఒబెరాయ్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (94) తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ఆయన మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా... హాస్పిటాలిటీ పరిశ్రమలో ఒబెరాయ్ సాధించిన కీర్తి సరిహద్దులను దాటిందని పేర్కొంది. ఆతిధ్య రంగంలో ఆయన సేవలు చెరగని ముద్ర వేశాయని కొనియాడింది.
అవును... భారత దేశ ఆతిథ్య రంగ దిగ్గజం, లగ్జరీ హోటల్స్ నిర్వహిస్తోన్న ఒబెరాయ్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ పృథ్వి రాజ్ సింగ్ ఒబెరాయ్ కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరణించారు. దీంతో... ఢిల్లీలోని పకషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫాం లో అంత్యక్రియలు జరగుతాయని వెల్లడించింది.
ఈ సందర్భంగా ఈయన మరణవార్తను వెల్లడించిన ఒబెరాయ్ గ్రూప్... ఈయనను కొనియాడింది. ఇందులో భాగంగా... తమ ప్రియతమ నాయకుడు పి.ఆర్.ఎస్. ఒబెరాయ్ తమను విడిచి వెళ్లారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని వెల్లడించింది. ఇదే క్రమంలో... ఆయన మరణం ఒబెరాయ్ గ్రూప్ తో పాటు భారత్ సహా విదేశీ ఆతిథ్య రంగానికి తీరని లోటని పేర్కొంది.
ఇదే క్రమంలో ఒబెరాయ్ దూర దృష్టి గల నాయకుడని, అంకితభావంతో ఒబెరాయ్ గ్రూప్ హోటళ్లను ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దారని వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఆయనకు గుర్తుగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గ్రూప్ వెల్లడించింది. వాటి వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
కాగా... ఒబెరాయ్ 1929లో ఢిల్లీలో జన్మించారు. ఆయన తండ్రి ఒబెరాయ్ గ్రూప్ వ్యవస్థాపకుడు దివంగత రాయ్ బహదూర్ ఎంఎస్ ఒబెరాయ్ 1934లో ఈ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఆయన అనంతరం పీ.ఆర్.ఎస్. ఒబెరాయ్ సుదీర్ఘకాలం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే ఈ సంస్థ ఓ వెలుగు వెలిగింది.
ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7 దేశాలలో 32 లగ్జరీ హోటళ్లు, 7 క్రూయిజ్ షిప్స్ ఈ గ్రూపులో ఉన్నాయి. ఈయన చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా 2008 జనవరిలో భారత ప్రభుత్వం.. పద్మ విభూషణ్ తో సత్కరించింది. అనంతరం ది ఇంటర్నేషనల్ లగ్జరీ ట్రావెల్ మార్కెట్.. 2012 డిసెంబర్ లో లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును అందించింది.
అదేవిధంగా... యూఎస్‌ఏ హోటల్స్ మ్యాగజైన్ 2010లో పి.ఆర్.ఎస్. ఒబెరాయ్ ని "2010 కార్పొరేట్ హొటెలర్ ఆఫ్ ది వరల్డ్" గా గుర్తించింది. దీనికోసం 150 కి పైగా దేశాల్లోని తమ రీడర్ల ఓటింగ్ ద్వారా ఒబెరాయ్ ని ఎంపిక చేసింది.