హాట్ టాపిక్... "పీటీఎస్ గ్రూప్" ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశారా?
ఈ సందర్భంగా పలు సంస్థలు ఇచ్చిన ఈ ఫలితాలు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించేశాయి.
By: Tupaki Desk | 1 Jun 2024 5:16 PM GMTఆంధ్రప్రదేశ్ లో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఎగ్జాట్ ఫలితాలు జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో జూన్ 1 (శనివారం) సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా పలు సంస్థలు ఇచ్చిన ఈ ఫలితాలు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించేశాయి. ఈ సందర్భంగా పీటీఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైరల్ గా మారాయి!
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా... పీటీఎస్ గ్రూప్ (పోల్స్ ట్రెండ్స్ & స్ట్రాటజీస్) ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఫలితాల ప్రకారం ఏపీలో కూటమి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టమవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 5 స్థానాలు అని చెబుతూ అంచనాలు వెల్లడించినప్పటికీ... కూటమికి స్పష్టమైన మెజారిటీ కనిపిస్తుంది.
పీటీఎస్ గ్రూప్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు గానూ టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఐదు సీటు అటు ఇటుగా 128 నుంచి 131 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేయబడింది. ఇదే క్రమంలో వైసీపీకి సైతం అదే ఐదు స్థానాలు అటు ఇటుగా 44 నుంచి 47 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని తెలిపింది. అంటే... 2014లో సాధించినన్ని స్థానాలు కూడా వైసీపీకి ఈసారి రావని ఈ సంస్థ విశ్లేషించింది!
ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సంస్థ వెల్లడించిన ఫలితాలను పరిశీలిస్తే... ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు కడప జిల్లాలోనూ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది! ఉదాహరణకు ఉమ్మడి కడప జిల్లాలో అధికార వైసీపీకి 4 నుంచి 5 స్థానాలు దక్కే అవకాశం ఉండగా.. కూటమికి 5 - 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
ఇక కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే టఫ్ ఫైట్ ని అంచనా వేసిన ఈ సంస్థ... మిగిలిన దాదాపు అన్ని స్థానాల్లోనూ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. ఇందులో భాగంగా... ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పాతపట్నం, విజయనగరం, మాడుగుల, పాడేరు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.
ఇదే సమయంలో... ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికొస్తే... కాకినాడ సిటీ, అనపర్తి, దెందులూరు, గోపాలపురం స్థానాల్లో టఫ్ ఫైట్ ఉందని వెల్లడించింది. ఇదే క్రమంలో... కైకలూరు, నరసరావుపేట, దర్శి, చీరాల, రాజంపేట, జమ్మలమడుగు, ఎమ్మిగనూరు, ఆదోని, కదిరి స్థానాల్లోనూ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని.. వీటిలోనూ మెజారిటీ స్థానాల్లో టీడీపీకే ఎడ్జ్ ఉందని అంచనా వేసింది!
ఏది ఏమైనా... ఈ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి స్పష్టమైన మెజార్టీని సాధిస్తుందని, మరో ఆలోచన లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పటుచేసే అవకాశం ఉందని ఈ పీటీఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి! కాగా... ఎగ్జాట్ ఫలితాలు జూన్ 4న రానున్న సంగతి తెలిసిందే!