Begin typing your search above and press return to search.

మరో కేసు... ఏసీబీ కోర్టులో బాబుపై పీటీ వారంట్‌!

ఈ సమయలో ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారంట్‌ జారీ అయ్యింది. ఫైల్ నంబర్ 2916/2023 తో చంద్రబాబుపై మరో పిటి వారెంట్ దాఖలు అయ్యింది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 1:37 PM GMT
మరో కేసు... ఏసీబీ కోర్టులో  బాబుపై పీటీ వారంట్‌!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ కేసుపై హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై తాజాగా వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు వెలువరించడానికి రెండు రోజుల సమయం పడుతుందని కోర్టు ప్రకటించింది. మరోపక్క సీఐడీ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది.

ఈ సమయలో ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారంట్‌ జారీ అయ్యింది. ఫైల్ నంబర్ 2916/2023 తో చంద్రబాబుపై మరో పిటి వారెంట్ దాఖలు అయ్యింది. ఏపీ ఫైబర్‌ నెట్‌ కుంభకోణంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా పిటి వారెంట్ తెరపైకి వచ్చింది. దీంతో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, పుంగనూరు అల్లర్ల కేసుల సరసన ఇప్పుడు నాలుగో కేసు చర్చనీయాంశం అయ్యింది.

కాగా... ఫైబర్‌ నెట్‌ స్కాంలో రూ.121 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్‌ దర్యాప్తులో తేలిందంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019లోనే ఫైబర్‌ నెట్‌ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వేమూరి హరి ప్రసాద్‌, ఏ2 మాజీ ఎండీ సాంబశివరావుగా పేర్కొంది.

అయితే చంద్రబాబుకు వేమూరి హరిప్రసాద్‌ అత్యంత సన్నిహితుడు కావడంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించిందని అంటున్నారు. టెర్రా సాఫ్ట్‌ కు టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ గడువు వారం రోజులు పొడిగించినట్లు తేల్చింది. ఇదే క్రమంలో బ్లాక్‌ లిస్ట్‌ లో ఉన్న టెర్రా సాఫ్ట్‌ కు టెండర్‌ దక్కేలా మేమూరి చక్రం తిప్పారని పేర్కొంది.

ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా.. రూ. 121కోట్ల మేర అవినీతిని సీఐడీ గుర్తించిందని అంటున్నారు. టెర్రా సాఫ్ట్‌ కు టెండర్లు కట్టబెట్టడం కోసం భారీగా అవకతవకలు జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారని తెలుస్తుంది. చంద్రబాబు సూచనల మేరకే టెర్రా సాఫ్ట్‌ వ్యవహరం మలుపులు తిరిగిందని ఏసీబీ ఆరోపిస్తుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి తాజాగా ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై పీటీ వారంట్‌ దాఖలయ్యింది.

కాగా ఇప్పటికే అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్డుపై ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేసిన సంగతి తెలిసిందే.

మరోపక్క ఇదే విషయంపై అధికార వైసీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. "ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మ‌రో కేసులో పీటీ వారెంట్ దాఖ‌లు చేసిన ఏపీ సీఐడీ. ఫైబ‌ర్ నెట్ పేరుతో రూ.121 కోట్ల మేర అవినీతి జ‌రిగింద‌ని గుర్తించిన‌ సీఐడీ. 2021లోనే ఈ స్కామ్‌ లో 19 మందిపై కేసు న‌మోదు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా వేమూరి హ‌రిప్రసాద్‌, ఏ2 ముద్దాయిగా మాజీ ఎండీ సాంబశివ‌రావు. ప్రస్తుతం చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ వారెంట్ దాఖ‌లు చేసిన సీఐడీ. పిటీష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు" అని ట్వీట్ చేసింది.