సంకెళ్లను తెంపే.. స్వేచ్ఛను నింపే.. ఇది కదా ప్రజా పాలన
కేసీఆర్ తొమ్మిదినరేళ్ల పాలనను విమర్శిస్తూ.. ప్రజా పాలన అందిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన నినాదం ప్రజలను ఆకట్టుకుంది
By: Tupaki Desk | 8 Feb 2024 2:45 AM GMTఏ మాటకా మాట.. కేసీఆర్ ది ప్రాంతీయ పార్టీ. ఆయన భయాలు ఆయనకు ఉంటాయి. ఒకవేళ నాయకులకు అతి స్వేచ్ఛ ఇస్తే వారు గాడితప్పే ప్రమాదం ఉంటుంది. అధినేతనే ధిక్కరించి పార్టీని బలహీనపరిచే ముప్పుంది. అంతేకాక.. కొన్ని సమీకర్ణాల రీత్యీ ఆయన నాయకత్వాన్ని అంగీకరించాలంటే కొన్ని విషయాల్లో రాజీ కూడా పడాల్సి ఉంటుంది. దీంతోనే పార్టీపై ప్రభుత్వంపై ఉక్కు పిడికిలి బిగించారు. పాలనకు వచ్చేసరికి దానిని ప్రజల స్వేచ్ఛ విషయంలోనూ వర్తింపజేశారు. ఫలితంగా ఓ విధంగా ఉక్కపోత వాతావరణం కనిపించింది.
ప్రజా పాలనలో అంతా ఓపెన్..
కేసీఆర్ తొమ్మిదినరేళ్ల పాలనను విమర్శిస్తూ.. ప్రజా పాలన అందిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన నినాదం ప్రజలను ఆకట్టుకుంది. అనేక పథకాలు, ప్రాజెక్టులు తెచ్చినా కేసీఆర్ పాలనలో స్వేచ్ఛ లేదనే ప్రజలు నమ్మారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు గెలుపు కట్టబెట్టారు. అలా తెలంగాణలో ప్రజా పాలనకు బీజం పడింది. వాస్తవానికి కాంగ్రెస్ జాతీయ పార్టీ. మిగతా పార్టీల కంటే అందులో ప్రజాస్వామ్యం ఎక్కువ. దీనినే స్వేచ్ఛగా భావిస్తారు. ఆ పార్టీ నాయకులకు ప్రత్యర్థులు సొంత పార్టీలోనే ఉంటారు. అయితే జాతీయ పార్టీ కావడం, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడంతో కాంగ్రెస్ పునాదులు వందేళ్లుగా బలంగా ఉన్నాయి.
ఇక తెలంగాణలో ప్రజా పాలన నినాదంతో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ చేపట్టిన మొట్టమొదటి పని.. అప్పటివరకు సీఎం నివాసంగా ఉన్న ప్రగతి భవన్ గేట్లను తెరవడం. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ లో సాధారణ పౌరులకు ప్రవేశం లేదన్న పెద్ద విమర్శ ఉంది. నాయకులు కూడా కొన్నిసార్లు ప్రగతి భవన్ గేట్ల నుంచి వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కారు ప్రగతి భవన్ ఎదురుగా ఉన్న ఇనుప గ్రిల్స్ ను తీసివేయించింది. ఒకప్పుడు సీఎం నివాసంగా ఉన్న దానిని నేడు డిప్యూటీ సీఎంకు కేటాయించింది. అందులో ఏకంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. వారంలో రెండు రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
ధర్నా చౌక్ పునరుద్ధరణ..
పదేళ్లు ఉమ్మడి ఏపీలో తీవ్ర నిర్బంధాలు, అవమానాలు ఎదుర్కొని ఉద్యమాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత చేసిన ఘోరమైన తప్పిదం.. ‘ధర్నా చౌక్’పై నిషేధం. నిరసనలు, ఆందోళనలకు వేదికయిన ధర్నాచౌక్ ను ఎత్తివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై కోర్టు కేసులూ నమోదయ్యాయి. కాంగ్రెస్ గెలిచాక ఆ నిషేధం తొలగిపోయింది. ముందుముందు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. ఇప్పుడైతే ధర్నా చౌక్ సంకెళ్లు తొలగాయి.
ధరణి రద్దు..
కేసీఆర్ సర్కారు హయాంలో భూ వ్యవహారాల ఉద్ధరణి అంటూ ధరణిని తీసుకొచ్చారు. కానీ, ఉద్దేశం మంచిదే అయినా అది ఆచరణలో అనేక సమస్యలకు దారితీసింది. ప్రజలను అత్యంత ఇబ్బంది పెట్టిన అంశంగా మారింది. రూరల్ లో కేసీఆర్ సర్కారుకు తక్కువ సీట్లు రావడానికి ధరణి ఇబ్బందులు ఓ కారణమే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ధరణి సంస్కరిస్తామని.. భూమాత పేరిట సులభతరమైన వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటించింది. తాజాగా కేసీఆర్ మానస పుత్రిక యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి యాదాద్రి నిర్మాణం బాగున్నా.. భక్తులు కొండపైకి వెళ్లేందుకు రవాణా లేక నానా ఇబ్బందులూ పడ్డారు. యాదాద్రి విశిష్టత దెబ్బతింటుందనో ఏమో ఇంత చిన్న విషయాన్నీ కేసీఆర్ సర్కారు విస్మరించింది.
రేవంత్ అందుబాటులోకి వస్తే..
సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ మీద ఉన్న ప్రధాన విమర్శ. ప్రజలకే కాదు ఎమ్మెల్యేలకూ అపాయింట్ మెంట్ ఇవ్వరని. అయితే.. రేవంత్ సీఎం అయిన తర్వాత ఆ పరిస్థితి మారిందని కచ్చితంగా చెప్పొచ్చు. ఇక కేసీఆర్ సచివాలయానికే రాలేదు. కొత్త సచివాలయం కట్టించాక ఓడిపోవడంతో రావాల్సిన అవసరమే లేకుండా పోయింది. అన్ని వ్యవహారాలనూ ప్రగతి భవన్ నుంచే చక్కబెట్టేవారు. అదే రేవంత్ నేరుగా సచివాలయాన్నే తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు.
విషయంతో గళమెత్తే మంత్రులు..
కేసీఆర్-రేవంత్ ప్రభుత్వాల మధ్య మరో ప్రధాన తేడా మంత్రులు. కేసీఆర్ సర్కారులోని మంత్రులకు శాఖలపై పట్టు లేదనేది విమర్శ. వారి విద్యార్హతలూ ఆ సందర్భంగా ప్రస్తావనకు వచ్చేవి. కానీ, రేవంత్ ప్రభుత్వంలో మంత్రులు అత్యధికులు ఉన్నత విద్యావంతులు కావడం, ప్రజా బలం ఉన్నవారు కావడం తేడాను చాటుతోంది. స్వేచ్ఛగా శాఖలను సమీక్షించడం, మీడియా ముందుకు అంతే స్వేచ్చగా వచ్చి మాట్లాడడం ఇందులో ముఖ్యమైనవి. మొత్తమీద చూస్తే.. ఇప్పటివరకు సాగిన రెండు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము చెప్పిన ‘ప్రజా పాలన’ను అందించే ప్రయత్నం చేసింది. ముందుముందు కూడా ఇది కొనసాగుతుందా? అనేది చూడాలి.