Begin typing your search above and press return to search.

మీ తమిళ అభిమానం సల్లగుండ!

తమిళులకు వారి భాష అన్నా.. సంస్కృతి సంప్రదాయాలు అన్నా ఎనలేని గౌరవం.. దాని కోసం వారు ఎంతకైనా వెళతారు.. ఎవరినైనా ఎదురిస్తారు

By:  Tupaki Desk   |   18 March 2025 7:21 PM IST
మీ తమిళ అభిమానం సల్లగుండ!
X

తమిళులకు వారి భాష అన్నా.. సంస్కృతి సంప్రదాయాలు అన్నా ఎనలేని గౌరవం.. దాని కోసం వారు ఎంతకైనా వెళతారు.. ఎవరినైనా ఎదురిస్తారు. వారి బ్లడ్ లోనే ఈ బ్రీడ్ ఉంది. అనాదిగా ద్రావిడ వాదంలో వారు రాజేసేది అదే.. ఇప్పటికీ కూడా హిందీ భాష రుద్దడంపై తమిళ పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి.. తాజాగా తమిళ అభిమానం మరోసారి చాటుకున్నారు. ఈసారి పుదుచ్చేరిలో తమిళంపై స్టిక్ట్ ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడు అధికారిక పార్టీ డీఎంకే, కేంద్ర ప్రభుత్వం మధ్య హిందీ భాషాధిపత్యం విషయంలో కొనసాగుతున్న వివాదం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడుకు పొరుగునే ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి కీలక ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి రాష్ట్రంలోని దుకాణాలు, వ్యాపార సముదాయాల సైన్‌బోర్డులపై తప్పనిసరిగా తమిళంలో పేర్లు ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా సర్క్యులర్ జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.

పుదుచ్చేరిలో తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ భాషలు అధికారికంగా ఉన్నాయి. అయితే, ఇక్కడ ఎక్కువ సంఖ్యలో తమిళం మాట్లాడే ప్రజలే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రంగస్వామి తీసుకున్న ఈ నిర్ణయం తమిళ ప్రజలకు ఊరట కలిగించే అంశం.

ఇదిలా ఉండగా.. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020)లోని త్రిభాషా సూత్రం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని, అందులో రెండు భారతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, కేంద్రం హిందీని దేశవ్యాప్తంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని పలు రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం అగ్నిమీద గుగ్గిలమవుతోంది. ఈ నేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో పుదుచ్చేరి నుంచి వచ్చిన ఈ ప్రకటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరోవైపు, కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వాల మధ్య హిందీ వివాదం గతంలో ‘రూపీ’ లోగో వివాదానికి కూడా దారితీసింది. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఇప్పటివరకు ఉన్న ₹ అనే లోగో స్థానంలో తమిళంలోని ‘రూ’ అనే అక్షరాన్ని మార్చడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. భాష విషయంలో తాము ఎంత దృఢంగా ఉన్నామో చెప్పడానికే ఈ మార్పు చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు.

మొత్తానికి, కేంద్ర ప్రభుత్వం యొక్క భాషా విధానాలపై తమిళనాడు చేస్తున్న పోరాటానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రకటన మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది. తమిళ ప్రజల భాషాభిమానాన్ని చాటుతూ, వారి గుర్తింపును కాపాడేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా భాషా రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.