జనసేనకు దక్కిన మరో కీలక పదవి
ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేనకు సముచితమైన న్యాయమే దక్కుతోంది అని చెప్పాలి. 21 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు.
By: Tupaki Desk | 5 Feb 2025 3:30 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేనకు సముచితమైన న్యాయమే దక్కుతోంది అని చెప్పాలి. 21 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు. వారిలో ముగ్గురికి కేబినెట్ లో మంత్రి పదవులు దక్కాయి. పవన్ సహా అందరికీ ముఖ్యమైన శాఖలే లభించాయి. తాజాగా చూస్తే మరో కీలకమైన పదవి జనసేన సొంతం చేసుకుంది.
ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా జనసేన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు దక్కింది. ప్రభుత్వంలో ఇది కీలకమైన పదవి. సాధారణంగా ఈ పదవికి విపక్షానికి ఇస్తారు. అయితే వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేయడంతో పాటు ప్రతిపక్ష హోదాకు సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడం వంటి కారణాలతో ఆ పదవిని అందుకోలేకపోయింది.
ఇక చూస్తే ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం కూడా ఉప్పూ నిప్పులా ఉంది. దాంతో సంప్రదాయాలు కూడా పక్కకు పోతున్నాయి. ఈ క్రమంలో జనసేనను అంతా కలసి వస్తోంది. ఆ పార్టీ కూటమిలో టీడీపె తరువాత ప్లేస్ లో ఉంది. కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు కూడా పూర్తి ఉదార స్వభావంతో ఉన్నారు.
అందువల్లనే ఆయనకే ఏకైక ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఐదు కీలక మంత్రిత్వ శాఖలను ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు మంత్రులకూ కీలక పోర్ట్ ఫోలియోలు దక్కాయి. ఇపుడు చూస్తే అత్యంత ముఖ్యమైన పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి దక్కింది. ఇది కూడా కేబినెట్ ర్యాంక్ పదవే.
దీనితో పాటు రానున్న కాలంలో జనసేనకు మరో మంత్రి పదవి కూడా లభిస్తుంది అని అంటున్నారు. ఆ పదవిని మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఇస్తారని కూడా చెబుతున్నారు. దాంతో జనసేనకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత పెరుగుతుంది అని అంటున్నారు
ఇదిలా ఉంటే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్ ని అలాగే ప్లానింగ్ కమిటీ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంతో శాసనసభా వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషించే ఈ పదవులు అన్నీ కూటమికే వెళ్ళినట్లు అయింది. ఈ కమిటీలలో ఉన్న మెంబర్స్ ని కూడా శాసన సభ, శాసన మండలిలోని కూటమి ఎమ్మెల్యేలంతో భర్తీ చేశారు.