పులివెందులకు ఉప ఎన్నిక..కూటమి భారీ స్కెచ్ ?
ఏపీలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట ఆ అసెంబ్లీ.
By: Tupaki Desk | 4 Feb 2025 1:30 AM GMTఏపీలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట ఆ అసెంబ్లీ. అక్కడ కొన్ని సందర్భాలలో ఉప ఎన్నికలు వచ్చాయి.అక్కడ కొన్ని సందర్భాలలోనే ఉప ఎన్నికలు వచ్చాయి. వైఎస్సార్ 1989లో అసెంబ్లీకి నెగ్గి ఆ తరువాత 1991లో పార్లమెంట్ కి పోటీ చేసినపుడు ఒకసారి వచ్చింది. ఆ తరువాత 2009లో వైఎస్సార్ మరణించినపుడు మరోసారి ఉప ఎన్నిక వచ్చింది.
అయితే ఇపుడు ఇంకోసారి ఉప ఎన్నిక వస్తుందని బాంబు పేల్చారు ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు ఎందుకు వస్తుంది అంటే జగన్ పులివెందుల ఎమ్మెల్యే గా అక్కడ ఉన్నారు. ఆయన అసెంబ్లీకి రావడం లేదు. దాంతో ఎవరైనా శాసనసభ్యుడు అరవై రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజర్ అయితే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడి తన ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోతారని రఘురామ చెబుతున్నారు.
అయితే అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకుని లీవ్ పెడితే మాత్రం సదరు సభ్యుడికి ఈ వేటు బాధ ఉండదని అంటున్నారు. దాంతో జగన్ అసెంబ్లీకి ఈసారి బడ్జెట్ కనుక రాకపోతే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని రఘురామ హెచ్చరిస్తున్నారు అన్న మాట.
అసెంబ్లీకి జగన్ హాజరై తన మనోభావాలను చెప్పుకోవాలని ఆయన కోరుతున్నారు. అసెంబ్లీకి జగన్ రావాల్సిందే అన్నట్లుగా ఆయన శాసనసభ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ మీద అనర్హత కత్తి వేటు నిజంగా పడుతుందా అన్నది చర్చగా ఉంది.
అసెంబ్లీకి గతంలో జగన్ రెండేళ్ళ పాటు గైర్ హాజరు అయ్యారు. ఆయన పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం మానుకున్నారు. ఇదంతా 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన ముచ్చట. అయితే ఆనాడు జగన్ ఎమ్మెల్యే సభ్యత్వం పోలేదు అని గుర్తు చేస్తున్నారు.
ఇక 2019 నుంచి 2024 మధ్యలో చివరి రెండేళ్ళ పాటు చంద్రబాబు కూడా సభకు హాజరు కాలేదు. ఆయన మీద కూడా ఎటువంటి అనర్హత వేటు పడలేదు అని అంటున్నారు. దాని కంటే ముందు 1990 ప్రాంతంలో ఉమ్మడి ఏపీలో విపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ కూడా అసెంబ్లీకి చివరి రెండేళ్ళు గైర్ హాజరు అయ్యారు. అపుడు కూడా ఆయన సభ్యత్వం కోల్పోలేదు అని అంటున్నారు.
అయితే ఈ విషయంలో కనుక సీరియస్ గా ఆలోచిస్తే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని ఒక వాదన ఉంది. ఏపీలో జగన్ విపక్షంలో ఉన్నారు. ఆయన పార్టీకి గడచిన ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో పాటు కడప జిల్లాలో కూడా మొత్తం పదికి మూడు ఎమ్మెల్యేలనే గెలుచుకున్నారు.
దాంతో కూటమి పార్టీలు తరచుగా కడపనే టార్గెట్ గా పెట్టుకుని సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహానాడు కూడా ఈసారి టీడీపీ కడపలో నిర్వహించాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో పులివెందులలో జగన్ కి బలం ఉందా లేదా అన్నది పక్కన పెడితే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఉప ఎన్నికలు వస్తే గెలిచేందుకు ఎక్కువ చాన్స్ ఉంటుదని లెక్క ఉంది. జగన్ నే మాజీ ఎమ్మెల్యేగా చేస్తే వైసీపీని 2029 దాకా చూడడం పోరాడడం కంటే ముందే ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడుతుంది అన్నది కూడా వ్యూహంగా అయి ఉండొచ్చు అని అంటున్నారు.
అందుకే రఘురామ ఈ అనర్హత వేటు ప్రస్తావన తెచ్చారని అంటున్నారు. పుంగనూరు సభలో జనసేన నేత నాగబాబు సైతం జగన్ సహా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రాని వారికి పదవులు ఎందుకు అని నిలదీశారు. మొత్తానికి చూస్తే ఒక వ్యూహం ప్రకారమే కూటమి ముందుకు సాగుతోంది అని అంటున్నారు. మరి జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నది కొద్ది రోజులలో జరగబోయే బడ్జెట్ సమావేశాలలో తేలుతుంది అని అంటున్నారు.