పులివెందులలో పెద్ద కుంభకోణం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ జమానాలో పర్యాటకాభివృద్ధి పేరు చెప్పి వందల కోట్లలో ప్యాలెస్ లు నిర్మించారని
By: Tupaki Desk | 3 July 2024 9:59 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ జమానాలో పర్యాటకాభివృద్ధి పేరు చెప్పి వందల కోట్లలో ప్యాలెస్ లు నిర్మించారని.. అందుకు రుషికొండ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని కూటమి పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా పులివెందులలో ఒక ఘనకార్యం తెరపైకి వచ్చింది!
అవును... పర్యాటకాభివృద్ధి పేరు చెప్పి జగన్ పాలనలో ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అయ్యిందంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైఎస్ జగన్ సొంత ప్రాంతం పులివెందులలో ఒక వ్యవహారం తెరపైకి వచ్చింది. పులివెందులలో పర్యాటకం ఏ స్థాయిలో ఉంటుందనే సంగతి కాసేపు పక్కనపెడితే... అక్కడ ఏ కంగా ఓ ఫోర్ స్టార్ బిల్డింగ్ కోసం అని బందువు క్లబ్ హౌస్ కొనేశారు!
వివరాళ్లోకి వెళ్తే... పులివెందులకు ఎంతమంది పర్యాటకులు వస్తారు అనేది చాలా మందికి తెలిసిన విషయమే! అలాంటి ప్రదేశంలో ఏకంగా నాలుగు నక్షత్రాల హోటల్ కోసం ప్లాన్ చేసింది జగన్ సర్కార్! ఇందులో భాగంగా... స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి బందువు విజయభాస్కర్ రెడ్డికి సంబంధించిన క్లబ్ హౌస్ ను రూ.12.87 కోట్లతో కొనిపించింది. అనంతరం దాన్ని ఫోర్ స్టార్ హోటల్ గా మార్చేందుకు రూ.23.50 కోట్లతో టెండర్లు పిలిచింది.
వాస్తవానికి పులివెందులలోని విజయా హోమ్స్ లో చవ్వా విజయభాస్కర్ రెడ్డికి చెందిన క్లబ్ హౌస్ 1.71 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని విలువ రూ.1.65 కోట్లుగా చెబుతున్నారు. ఇక ఇందులోని 46వేల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ నిర్మాణాలను రూ.7.46 కోట్లకు కొన్నారు. అంటే మొత్తం విలువ రూ.9.11 కోట్లన్నమాట. అయితే... దీనికి మరో రూ.3.75 కోట్లు జతచేసి మొత్తం 12.87 కోట్ల రూపాయలు చెల్లించారు.
ఇలా రూ.12.87 కోట్లతో ఆఘమేఘాలపై పులివెందులలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ క్లబ్ హౌస్ ను ఎందుకు కొన్నారు.. అనంతరం ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది! అసలు పులివెందులలో స్టార్ హోటల్ నిర్మించడం వల్ల పర్యాటకాభివృద్ధి సంస్థకు ఏ మేరకు ప్రయోజనం అనే ఆలోచన నాటి అధికారులు చేయలేదా అనేది మరో ప్రశ్న.
అలా అని ఈ వ్యవహారం అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే! రూ.12.87 కోట్లతో కొన్న ఈ క్లబ్ హౌస్ ను ఫోర్ స్టార్ హోటల్ గా రూ.23.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) ద్వారా టెండర్లు పిలిచారు. దీన్ని అభివృద్ధి చేసి అనంతరం పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు.
అయితే ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ప్రభుత్వం మారడంతో వ్యవహారం ఇలా మిగిలి, వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.