Begin typing your search above and press return to search.

పులివెందులలో పొలికేక...రాజకీయ కాక

రాయలసీమకు మోక్షం కలగాలంటే వైసీపీ ఓడాలని చంద్రబాబు అంటున్నారు. జగన్ని పులివెందులలో ఓడిస్తామని ఆయన చెబుతున్నారు

By:  Tupaki Desk   |   1 Aug 2023 5:30 PM GMT
పులివెందులలో పొలికేక...రాజకీయ కాక
X

పులివెందుల అంటే ఠక్కున వైఎస్సార్ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. 1978లో మొదలెట్టిన ఆ కుటుంబం రాజకీయం ఈ రోజుకూ కంటిన్యూ అవుతోంది. అలాగే ఆ ఫ్యామిలీని పులివెందుల అలాగే గెలిపిస్తూ వస్తోంది. వైఎస్సార్, వైఎస్ వివేకా, వైఎస్ వైజయమ్మ, జగన్ ఇలా అందరూ పులివెందుల నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే.

ఇక చూసుకుంటే 2014లో జగన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో అయితే ఆయన మెజారిటీ రికార్డు దాటింది. ఏకంగా 90 వేల పై చిలుకు మెజారిటీతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ని జగన్ కొట్టేశారు. అలాంటి పులివెందుల గడ్డ మీద ఇపుడు విపక్షం రీ సౌండ్ చేస్తోంది. వై నాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు.

ఆయన ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమలో నాలుగు రోజులు పర్యటిస్తున్నారు. పులివెందులలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్ మీదనే సమర సింహ నాదాన్ని పూరించనున్నారు. రాయలసీమకు మోక్షం కలగాలంటే వైసీపీ ఓడాలని చంద్రబాబు అంటున్నారు. జగన్ని పులివెందులలో ఓడిస్తామని ఆయన చెబుతున్నారు.

బాబు కంటే ముందు కడపలో పాదయాత్ర చేసిన లోకేష్ బాబు అయితే పులివెందుల వెళ్లలేదు కానీ మొత్తం కడపలోని ఇతర నియోజకవర్గాలని కలియతిరిగారు. ఆయనకు కడప వీధులలో జనాలు బాగానే వచ్చారు. లోకేష్ సైతం ఈసారి కడపలో అన్ని సీట్లూ గెలుచుకుంటామని అన్నారు.

పులివెందుల అంటే ఎవరూ పెద్దగా చూసేవారే కాదు. అలాంటిది ఇపుడు ఎందుకు ఆ వైపు చూపు, ఎందుకు ఈ గర్జనలు అంటే జగన్ టార్గెట్ కుప్పంగా ఉంది. దాంతో బాబు పులివెందుల వైపు ఫోకస్ పెంచారు అని అంటున్నారు. ఏడు సార్లు చంద్రబాబు కుప్పంలో గెలిచారు. అలాంటి చోట ఈసారి ఓడిస్తామని వైసీపీ అంటోంది.

దాంతో టీడీపీ కూడా పులివెందులలో జగన్ని ఓడిస్తామని శపధం చేస్తోంది. అయితే ఈ రెండూ సాధ్యమా అంటే కానే కాదు అని చెప్పాలి. ఇద్దరు నేతలకూ పట్టున్న సీట్లు అవి. కానీ ఏకంగా అధినేత సొంత సీట్లలోనే రాజకీయ అలజడిని రేపడం ద్వారా వారి ఫుల్ అటెన్షన్ ని ఈ వైపుగా తిప్పు టెన్షన్ పుట్టించాలన్నదే రాజకీయ ఎత్తుగడ.

ఇదిలా ఉంటే ఈసారి వైసీపీకి ఏపీలో 15 సీట్లే వస్తాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తనదైన జోస్యం వదిలారు. అంతే కాదు పులివెందులలో జగన్ ఓడిపోతారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. పులివెందులలో జగన్ ఓడడం అంటే ఆ పదిహేను సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వస్తాయి.

అంటే బొత్తిగా లాజిక్ లేని విధంగానే ఈ స్టేట్మెంట్ ఉందని అంటున్నారు. అయినా సరే పులివెందుల జగన్ అంటూ ఏపీ రాజకీయం పొలికేక వేస్తోంది. జగన్ మీద గట్టిగానే గురి పెడుతోంది. ఈసారి పులివెందులలో జగన్ గెలుపు విషయమో ఢోకా లేదు. మెజారిటీ కూడా భారీగానే ఉంటుంది. కానీ 2019లో వచ్చిన 90 వేల 110 ఓట్ల మెజారిటీ మీద ఒక్క ఓటు తగ్గినా పులివెందుల మీద తమ జోస్యమే నిజం అయిందని విపక్షాలు గట్టిగా సౌండ్ చేసే ప్రమాదం అయితే ఉంది మరి.