Begin typing your search above and press return to search.

పంచ్ ప్రభాకర్ మీద బెజవాడలో సైబర్ పోలీసుల కేసులు

అంతలోనూ.. మళ్లీ యధావిధిగా ఏపీ సీఎం.. డిప్యూటీ సీఎంలను నోటికి వచ్చినట్లుగా తిడుతూ వీడియోలు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 4:08 AM GMT
పంచ్ ప్రభాకర్ మీద బెజవాడలో సైబర్ పోలీసుల కేసులు
X

పొలిటికల్ యూట్యూబ్ చానళ్లను ఫాలో అయ్యే తెలుగు వారికి ప్రభాకర్ రెడ్డి చీనేపల్లి అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చుకానీ.. పంచ్ ప్రభాకర్ అంటే చాలు ఇట్టే గుర్తిస్తారు.వైసీపీకి కరుడుగట్టిన సానుభూతిపరుడిగా.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లపై అదే పనిగా విరుచుకుపడతూ.. చిన్నపిల్లలతో కలిసి చూడలేని విధంగా తిట్ల పురాణంతో వీడియోలు పెట్టే అలవాటు ఆయనకు ఎక్కువే. అలాంటి పంచ్ ప్రభాకర్ ఇటీవల కాలంలో రూటు మార్చిన భావన కలిగేలా కొన్ని వీడియోలు పెట్టారు. అంతలోనూ.. మళ్లీ యధావిధిగా ఏపీ సీఎం.. డిప్యూటీ సీఎంలను నోటికి వచ్చినట్లుగా తిడుతూ వీడియోలు పెడుతున్నారు.

విదేశాల్లో ఉండే ఆయనకు బెజవాడ పోలీసులు కేసుల షాక్ ఇచ్చారు. విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన డి.రాజు అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వారిని తిడుతూ పోస్టింగ్ లు పెట్టిన బాయిజయంతి అనే ఎక్స్ అకౌంట్ పైనా సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

అసభ్య పదజాలంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఎక్స్ లో పోస్టులు పెట్టిన వ్యక్తిపైనా నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పాత పాయకాపురానికి చెందిన జనసేన నాయకుడు శౌరిశెట్టి రాధాకిరణ్ పోలీసులకు కంప్లైంట్ చేయగా.. కేసు నమోదైంది. ఇటీవల పోలీసుల తీరును ఘాటుగా ప్రశ్నించిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచనలంగా మారాయి. ఆ వ్యాఖ్యల అనంతరం.. బెజవాడ పోలీసులు కేసులు నమోదు చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.