డ్రోన్లు.. కుక్కలతో పూణె రేప్ కేస్ నిందితుడ్ని పట్టేశారు
నిందితుడ్ని గుర్తించేందుకు జాగిలాలు.. డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. మొత్తానికి పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి.
By: Tupaki Desk | 28 Feb 2025 10:44 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫూణె రేస్ కేస్ నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. అక్కా అంటూ మాయమాటలు చెప్పి.. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులోకి తీసుకెళ్లి రేప్ చేసిన వైనంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ కేసులో నిందితుడ్ని 75 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు జాగిలాలు.. డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. మొత్తానికి పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి.
మహారాష్ట్రలోని ఫూణె నగరంలో చోటు చేసుకున్న ఈ అత్యాచార ఘటన పెను సంచలనంగా మారింది. అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్ గేట్ లో మంగళవారం ఉదయం ఆరు గంటల వేళలో ఈ దారుణం చోటు చేసుకుంది. సొంతూరుకు వెళ్లేందుకు ఒక యువతి బస్టాండ్ కు చేరుకుంది. ‘అక్కా’ అంటూ ఆమెతో మాటలు కలిపిన నిందితుడు ఆమె వెళ్లాల్సిన ఊరికి చెందిన బస్సు వేరే చోట ఉందని నమ్మించాడు. ఆ బస్సు బస్ స్టేషన్ కు కాస్త దూరంలో ఉందని చెప్పాడు.
అతడి మాటల్ని నమ్మిన ఆ యువతి.. కాస్త దూరంలో ఎవరూ లేని చోట ఆగి ఉన్న బస్సును చూపించాడు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు. ఎవరూ లేరు కదా? అంటే.. బస్సు లోపల నిద్ర పోతుంటారని.. లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోపలకు వెళ్లినంతనే ఖాళీగా ఉండటం.. ఆ వెంటనే బస్సు డోర్ మూసిన దుర్మార్గుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి కేవలం వంద మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం.. ఈ అత్యాచార ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.
దీంతో అలెర్టు అయిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్ గా గుర్తించారు. గతంలో అతడిపై పలు నేరాల మీద కేసులున్నాయి. 2019 నుంచి బెయిల్ మీద ఉన్న అతన్ని పట్టుకునేందుకు 13 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకునే విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు.. నిందితుడి ఆచూకీ కోసం డ్రోన్లు.. జాగిలాల్ని సైతం రంగంలోకి దించారు.
ఇతగాడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించారు. శ్రీరూర్ చెరుకు తోటలో దాక్కున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. గురువారం అర్థరాత్రి నిందితుడికి ఆకలేసి ఒక ఇంటికి వెళ్లాడు. వారు ఇతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని రామ్ దాస్ ను అరెస్టు చేశారు. వీడిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వస్తోంది.