పూణె కారు ఘటన... మొన్న తండ్రి, నిన్న తాత, తాజాగా తల్లి అరెస్ట్!
ఈ క్రమంలోనే నిందితుడి స్థానంలో అతడి తల్లి శాంపిళ్లను బ్లడ్ టెస్ట్ కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సమయంలో ఆమె ఆచూకీ లేకుండా పోయారు.
By: Tupaki Desk | 1 Jun 2024 6:19 AM GMTమహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ బాలుడి ర్యాష్ డ్రైవింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ కేసులో నిందితుడైన బాలుడి వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచీ అతడిని తప్పించడానికన్నట్లుగా సాగుతున్నట్లు చెబుతున్న పలు వ్యవహారాలు సినిమా స్క్రిప్ట్ ని తలదన్నేలా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా అతడి స్థానంలో ఫ్యామిలీ డ్రైవర్ ను కేసులో ఇరికించాలని చూస్తున్నారంటూ అతని తాత అరెస్ట్ కావడం.. ఇప్పటికే అతడు మద్యం సేవించిన బార్ యజమానులతో పాటు, ఈ బాలుడి తండ్రిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నిందితుడి తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అవును... పుణెలో ఓ మైనర్ బాలుడి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెక్కీలు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలుడిని ఈ కేసునుంచి తప్పించేందుకు అతడి కుటుంబం కొందరు అధికారులతో కలిసి చేసిన యత్నాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తూ విస్తుగొల్పుతున్నాయి.
ఇందులో భాగంగానే బ్లడ్ టెస్ట్ కి శాంపుల్స్ సేకరించే సమయంలో నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చిన తల్లిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మైనర్ తాగలేదని నిరూపించేందుకు ఆమె రక్తనమూనాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
కాగా... ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ తావ్డే, నిందితుడి తండ్రి ఫోన్ లో మాట్లాడుకున్నారని ఇప్పటికే పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిందితుడి స్థానంలో అతడి తల్లి శాంపిళ్లను బ్లడ్ టెస్ట్ కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సమయంలో ఆమె ఆచూకీ లేకుండా పోయారు.
అయితే ఆమె ఆచూకీ సంపాదించిన పోలీసులు... సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్ ను మార్చిన ఆరోపణలపైనా ఆమెను తాజాగా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈరోజు ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇప్పటివరకూ ఈ కేసులో నిందితుడితో పాటు అతనికి సంబంధించిన ముగ్గురు కుటుంబ సభ్యులు అరెస్ట్ అవ్వగా... ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ తావ్డే, డాక్టర్ శ్రీహరి హల్నోర్ తో పాటు ఆసుపత్రి గుమస్తా సస్పెన్షన్ కు గురయ్యారు!