వీడియో వైరల్.. దండయాత్ర.. దండయాత్ర.. ఇది దోమల దండయాత్ర!
ప్రజలు బయటకు రావడం ఆలస్యం గుంపులుగా గుంపులుగా వచ్చి దోమలు వారిపై దాడి చేస్తున్నాయట.
By: Tupaki Desk | 12 Feb 2024 10:30 AM GMTటెంపర్ సినిమాలో దండయాత్ర.. దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర అన్నట్టు ఇప్పుడు మహారాష్ట్రలోని ఫుణే నగరంపై దోమల దండయాత్ర చేస్తున్నాయి. మహారాష్ట్రలో ముంబై తర్వాత రెండో అతిపెద్ద నగరం.. పుణే. నగరంలోని ముంధ్వా, కేశవనగర్, ఖరాడీ ప్రాంతాలతోపాటు ముఠా నదిపై దోమలు టోర్నడో మాదిరిగా తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దోమల దెబ్బకు పుణే వాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారట. ప్రజలు బయటకు రావడం ఆలస్యం గుంపులుగా గుంపులుగా వచ్చి దోమలు వారిపై దాడి చేస్తున్నాయట. ఈ దోమల బెడద కేవలం సామాన్యులకే కాదు సంపన్నులకూ తలెత్తుతోంది. దీంతో తలుపులు తీసి బయటకు రాలేక ఇళ్లల్లోనే తలుపులు బిడాయించుకుని కూర్చోవాల్సి వస్తోంది.
దోమల దండయాత్ర ధాటికి ఇళ్లల్లోని బాల్కనీల్లో కూడా సరదాగా కూర్చోలేకపోతున్నారు. ఇక పాపం పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దోమల దెబ్బకు బయటకు ఆడుకోవడానికి కూడా వెళ్లలేకపోతున్నారు. పిల్లల ఆటలకు దోమలతో బ్రేకులు పడ్డాయి.
ఈ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోమల బారి నుంచి తమను రక్షించాలని అధికారులను కోరుతున్నారు.
దోమలు ఈ స్థాయిలో విజృంభిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫుణే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై నిప్పులు చెరుగుతున్నారు.
ముఠా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో మురుగు చేరడం, నదిలోని ప్రాజెక్టులు, ఆనకట్ట పనుల వల్ల నీటి ప్రవాహం తగ్గిపోయిందని తెలుస్తోంది. దీంతో మురుగు చేరి దోమలు భారీగా వ్యాపిస్తున్నాయని సమాచారం. వీలైనంత త్వరగా ఈ దోమల బెడదకు పరిష్కారం చూపాలని అధికారులను కోరుతున్నారు.
సక్రమంగా తాము మున్సిపల్ కార్పొరేషన్ కు అన్ని పన్నులు చెల్లిస్తున్నామని ప్రజలు గుర్తు చేస్తున్నారు. కానీ ఇంతేస్థాయిలో అధికారుల నుంచి స్పందన ఉండటం లేదని వాపోతున్నారు. దోమలతో తీవ్ర జర్వాలు వచ్చే ప్రమాదం ఉందని.. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.