పుణె ర్యాష్ డ్రైవింగ్ కేసులో కొత్త ట్విస్ట్!
మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ పోర్షే కారును ర్యాష్ గా డ్రైవింగ్ చేసిన కారణంగా ఇద్దరు టెక్కీలు మృతి చెందిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 24 May 2024 4:57 AM GMTమహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ పోర్షే కారును ర్యాష్ గా డ్రైవింగ్ చేసిన కారణంగా ఇద్దరు టెక్కీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆ ప్రమాదం అనంతరం ఆ మైనర్ కు 15 గంటల్లోనే బెయిల్ దక్కింది. ఇక ప్రమాదానికి ముందు ఆ టీనేజర్ చేసిన పని వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ కేసులో సరికొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
అవును... పూణెలో టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేసినట్లు చెబుతున్న సదరు టీనేజర్.. యాక్సిడెంట్ చేయడానికి కొద్దిసేపటి ముందు తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. కేవలం 90 నిమిషాల్లోనే రూ.48వేల ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసిందని చెబుతున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉన్నది తాను కాదు తన ఫ్యామిలీ డ్రైవర్ అని అంటున్నాడట ఆ మైనర్! అవును... ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్నది తన కొడుకు కాదని, తన ఫ్యామిలీ డ్రైవర్ అని మైనర్ యొక్క తండ్రి తాజాగా కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు!
ఇదే విషయాన్ని ప్రమాదానికి కారకుడయ్యాడనే మైనర్ కూడా చెబుతున్నారు. వీరి మాటలకు మరో ఇద్దరు స్నేహితులు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై వారి ఫ్యామిలీ డ్రైవర్ ను విచారించగా... ఆ రోజు తానే వాహనం నడుపుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం జువైనల్ జస్టిస్ బోర్డు ఆ యువకుడిని అబ్జర్వేషన్ హోమ్ కు పంపింది.
కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు సదరు మైనర్ పై ఐపీసీ సెక్షన్ 304, 304 ఎ, 279 తోపాటు మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ ల కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు! మరి ఈ ట్విస్ట్ అనంతరం ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకోబోతోందనేది వేచి చూడాలి!