పుణె ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడి తాత అరెస్టు... పెద్ద స్కెచ్చే ఇది!
ఇటీవల పుణెలో ఓ మైనర్ యువకుడు మద్యం మత్తులో లగ్జరీ కారుతో బైక్ ను ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 25 May 2024 8:28 AM GMTఇటీవల పుణెలో ఓ మైనర్ యువకుడు మద్యం మత్తులో లగ్జరీ కారుతో బైక్ ను ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు టెక్కీలు మృతి చెందారు! రకరకాల మలుపులు తీసుకుంటున్న ఈ కేసులో తాజాగా నిందితుడి తాతను అరెస్టు చేశారు పోలీసులు. ఈ క్రమంలో అతడి స్కెచ్ ను తెరపైకి తెచ్చారు!
అవును... పూణెలో పోర్షో కారుతో ఇద్దరి మరణానికి కారణమైన యువకుడికి సంబంధించిన కేసులో... తాజాగా పోలీసులు కీలక అడుగు వేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి తాతను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నేరాన్ని తమ ఫ్యామిలీ డ్రైవర్ పై మోపేందుకు నిందితుడి కుటుంబం ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
వాస్తవానికి ఈ కేసులో బాలుడిని జైలు శిక్ష నుంచి కాపాడడం కోసం అతడి కుటుంబ సభ్యులు తీవ్రగా ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు రెండు బార్లలో ఫుల్ గా తాగినట్లు సాక్ష్యాలున్నాయని అంటున్నారు. అయితే... ప్రమాద సమయంలో కారును తమ ఫ్యామిలీ డ్రైవర్ నడిపాడని బాలుడి తండ్రి కొత్త టాపిక్ తెరపైకి తెచ్చారు.
ఈ కొత్త వ్యవహారానికి సంబంధించి ఇద్దరు సాక్ష్యులను కూడా రెడీ చేశారని అంటున్నారు. అయితే ఆ సమయంలో తమ డ్రైవర్ కారు నడుపుతున్నాడనే విషయాన్ని సదరు డ్రైవర్ ఖండించారు. ఆ సమయంలో తాను అక్కడ లేనని.. బాలుడే స్వయంగా కారును నడిపాడని వెల్లడించాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా ప్రమాదం జరిగిన సమయంలో తానే డ్రైవింగ్ చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిందితుడి తాత తనను బెదిరిస్తునారని.. ఈ విషయంలో తనపై ఒత్తిడి తెస్తున్నారని.. తనను నిర్భంధించారని ఆ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో... విషయం గ్రహించిన పోలీసులు నిందితుడి తాతను అరెస్ట్ చేశారు.
కాగా... ఈ కేసులో నిందితుడైన బాలుడి తండ్రి స్థానికంగా ఓ ప్రముఖ ప్రైవేటు బిల్డర్ అని.. అందువల్ల పోలీసులు ప్రమాదానికి కారకుడైనట్లు చెబుతున్న బాలుడిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని.. తమ పిల్లలను చంపిన బాలుడిని మేజర్ గా పరిగణించి తగిన శిక్ష విధించాలని మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.