Begin typing your search above and press return to search.

రగులుతున్న ఖాకీ...ఒక్క పది నిముషాలు చాలుట...!

మొత్తానికి చూస్తే పుంగనూరు ఘటనలో పోలీసులకు తీవ్ర గాయాల పాలు కావడం, ఏకంగా కళ్ల ముందే పోలీస్ వ్యాన్ ని తగులబెట్టడం జాతీయ స్థాయిలోనే హైలెట్ అవుతోంది

By:  Tupaki Desk   |   6 Aug 2023 2:30 AM GMT
రగులుతున్న ఖాకీ...ఒక్క పది నిముషాలు చాలుట...!
X

రాజకీయాలు ముదిరిన వేళ మధ్య్న నలిగేది అధికారులే. వారికంటే ముందు పోలీసులే. వారు ఎపుడూ ఫోర్ ఫ్రంట్ లో ఉంటారు. అందరూ వారినే తప్పు పడతారు. కానీ వారి బాధ్యతలు చాలా కఠినమైనవి, క్లిష్టతరమైనవి. కష్టతరమైనవి. పుంగనూరులో అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీల మధ్య జరిగిన సంఘర్షణలో అచ్చంగా బలి అయింది పోలీసులే అన్న మాట వినిపిస్తోంది.

విద్వంశ శక్తులు పోలీస్ వ్యాన్ ని కిందకు తోసి మరీ తగులబెట్టిన దృశ్యాల వీడియో ఫుటేజీలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు చేతికి అందిన రాళ్లను తీసుకుని పోలీసుల మీద అరాచకవాదులు దాడి చేయడమూ వైరల్ అయింది. వారంతా టీడీపీ కార్యకర్తలే అని వైసీపీ వారు అంటున్నారు. ఇదంతా వైసీపీయే చేయించింది అని టీడీపీ అంటోంది.

కానీ సత్యం ఏంటి అంటే ఈ రాళ్ల దాడి వల్ల ఏకంగా పదమూడు మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారు ఆయుధాలతో ఉండి మరీ గాయపడ్డారు. ఇదే విశేషం. పోలీసుల చేతుల్లో లైసెన్స్డ్ రైఫిల్ ఉంటుంది. దానిని వారు ప్రయోగిస్తే అక్కడ పబ్లిక్ లో ఎంత మంది తూటాలకు బలి అయ్యేవారో.

దీంతో ఇపుడు పబ్లిక్ సేవ్ అయ్యారు. కానీ సహనంతో వ్యవరించిన మేము బలి అయ్యామని పోలీసులు అంటున్నారు. దీని మీద పోలీస్ అధికారుల సంఘం అయితే తీవ్రంగా మండిపడుతోంది. మేము సహనంతో ఉన్నాం కాబట్టి మాకే గాయాలు చేసుకున్నాం అదే ఒక్క పది నిముషాలు ఏమీ కాదని మా ఉద్యోగాలను పక్కన పెట్టి ఉంటేనా పరిస్థితి వేరే విధంగా ఉండేదని పోలీసు అధికారులు అంటున్నారు.

దీని మీద పోలీసు ఉన్నతాధికారిణి నాగిని అయితే మీడియా ముందు ఫైర్ అయ్యారు మాకు కూడా కుటుంబం ఉంది. మాకూ ఆత్మాభిమానం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. రాతీ పగలూ అనకుండా డ్యూటీస్ చేస్తామని, అలాగే మా ఆరోగ్యాలను సైతం లెక్క చేయమని ఆమె అంటున్నారు. మేము ఏ రాజకీయ పక్షం కాదు,కానీ మా ఉద్యోగాలకు విధులకు అడ్డు వస్తున్నారు అని వాపోతున్నారు.

అరాచక శక్తుల రాళ్ల దాడికి పోలీసులే గాయపడ్డారు, అదే పబ్లిక్ కి ఏమైనా అయితే మమ్మల్ని ఎన్నేసి మాటలు అనే వారో కదా అని నాగిని అంటున్నారు. మరో వైపు చూస్తే పోలీసు అధికారులు ఈ ఘటన మీద మాట్లాడుతూ మాది చేతకానితనం అని ఎవరూ అనుకోవద్దు అని హెచ్చరించారు. ఈ ఘర్షణలో అమాయకులు సామాన్య ప్రజలు బలి కాకూడదనే సంయనమంతో వ్యవహరించామని చెప్పుకొచ్చారు.

మొత్తానికి చూస్తే పుంగనూరు ఘటనలో పోలీసులకు తీవ్ర గాయాల పాలు కావడం, ఏకంగా కళ్ల ముందే పోలీస్ వ్యాన్ ని తగులబెట్టడం జాతీయ స్థాయిలోనే హైలెట్ అవుతోంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగా కూడా చూస్తున్నారు. నిజానికి పోలీసులు అంటే ప్రభుత్వం తరఫున పనిచేస్తారు అని అంటారు.

కానీ లా అండ్ ఆర్డర్ వారే చూడాలి. వారు ముందుకు వచ్చి కట్టడి చేయకపోతే ఎవరికైనా ఇబ్బందే. ఆ సమయంలో వారి మీద రాజకీయ ముద్ర పడుతూ ఉంటుంది. ఈ రోజున అధికారంలో ఉన్న వైసీపీ కూడా గతంలో పోలీసుల మీదనే నిందలు వేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇపుడు తెలుగుదేశం పోలీసుల మీద నేరుగా విమర్శలు చేస్తోంది. పోలీసులలో కొందరు నీతి తప్పిన వారు ఉన్నారని చంద్రబాబు వంటి వారు డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.

అలాంటి పోలీసుల చిట్టాను సేకరిస్తున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పోలీసుల తీరు ఉందని అంటున్నారు. తాము విధి నిర్వహణనే చేస్తున్నామని వారు ఎంత మొత్తుకున్నా విపక్షాలు క్షమించడంలేదు. ఇక అధికార పక్షం ఎపుడూ దూకుడుగానే ఉంటుంది. మధ్యలో నలుగుతూ రగులుతున్నారు పోలీసులు.

ఇప్పటికి ఏడు నెలల క్రితం ఇదే చిత్తూరు జిల్లా కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా అచ్చెన్నాయుడు పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ముందూ తరువాత అనేక సందర్భాలలో అలాంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు రగిలిపోతున్నారు, ఒక విధంగా నలిగిపోతున్నారు అనే అంటున్నారు. అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగి ఆగ్రహించిన తీరున పోలీసులు కనుక సహనం కోల్పోతే అది సమాజానికే ముప్పు అన్నది బాధ్యత కలిగిన అన్ని రాజకీయ పక్షాలూ గుర్తించాలని అంటున్నారు.