ట్రావెల్ ఏజెంట్లపై చర్యల కత్తి దూసిన పంజాబ్ సర్కారు
ఒకవేళ.. ఎవరైనా తప్పు చేయాలన్న మైండ్ సెట్ లో ఉన్ననప్పికి వారికి సహకారం అందించే వారు ఉండరు.
By: Tupaki Desk | 25 Feb 2025 8:30 AM GMTతప్పు జరిగిందని.. తప్పు చేశారంటూ శిక్షలు వేయటం మంచిదే. కానీ.. సదరు తప్పులకు కారణమైనోళ్లను.. తప్పులు చేసేలా ప్రోత్సహించే వారిని కూడా వదలకూడదు కదా? నిజానికి తప్పుడు పనులు చేసేందుకు పోత్సహించే వారి విషయంలో ఎప్పుడైతే చట్టాలు.. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తాయో.. తప్పు చేయాలన్న ఆలోచనే రాకుండా పోతుంది. ఒకవేళ.. ఎవరైనా తప్పు చేయాలన్న మైండ్ సెట్ లో ఉన్ననప్పికి వారికి సహకారం అందించే వారు ఉండరు. ధనార్జన కోసం విదేశాలకు తప్పుడు మార్గాల్లో పంపుతామని కబుర్లు చెప్పి.. అడ్డంగా బుక్ చేసే ట్రావెల్ ఏజెంట్లపై అటు అగ్రరాజ్యం కానీ.. ఇటు బాధితుల దేశాలకు సంబంధించిన కానీ చర్యలు తీసుకున్నది కనిపించదు.
ఆ లోటు తీరేలా పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్లిన పలువురిని ఆ దేశం బహిష్కరించటమే కాదు.. గొలుసులతో బంధించి మరీ స్వదేశానికి పంపుతున్న వైనం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటివరకు 300 మంది భారతీయుల్ని అమెరికా తిరిగి పంపటం తెలిసిందే. వీరంతా ట్రావెల్ ఏజెంట్ల చేతిలో మోసపోయినట్లుగా వాపోతున్నారు. ఆస్తుల్ని అమ్ముకొని.. భారీగా అప్పులు చేసి మరీ అమెరికాకు ప్రయాణమయ్యారు. తమకు తప్పుడు మాటలు చెప్పి మోసం చేసినట్లుగా బాధితులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రియాక్టు అయ్యింది. అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించే ఏజెంట్ల మీద కొరడా ఝుళిపించింది. అమృత్ సర్ లో దాదాపు నలభై మంది ట్రావెల్ ఏజెంట్ల లైసెన్సుల్ని రద్దు చేసింది. ఇటీవల అమెరికా తిప్పి పంపిన భారతీయుల్లో ఎక్కువమందిని ఈ ఏజెంట్లే అగ్రరాజ్యానికి తప్పుడు పద్దతుల్లో పంపినట్లుగా అక్కడి ప్రభుత్వం గుర్తించింది. వీరితో పాటు లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోని 271 మందికి పంజాబ్ పోలీసులు నోటీసులు పంపారు. అక్రమ పద్దతిలో అమెరికాకు వెళ్లి.. తిరిగి వచ్చిన భారతీయుల్లో అత్యధికులు పంజాబ్ కు చెందిన వారే కావటంతో.. అక్కడి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు షురూ చేసింది. ఇదే సమయంలో.. తమ దేశాలకు అక్రమ పద్దతిలో విదేశీయుల్ని డంప్ చేసే వ్యవస్థల్ని గుర్తించి.. వారిపైనా అగ్రరాజ్యం చర్యలు తీసుకుంటే కొంత మార్పు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.