ఒక్కో కుక్క పంటిగాటుకు రూ.10వేలు కట్టాల్సిందే.. తేల్చిన ఆ హైకోర్టు
కుక్క పంటిగాటు ఒంటి మీద పడితే.. ఒక్కో గాటుకు రూ.10వేలు చొప్పున ప్రభేుత్వం బాధితులకు చెల్లించాలని చెప్పింది.
By: Tupaki Desk | 15 Nov 2023 4:34 AM GMTసంచలన తీర్పును ఇచ్చింది పంజాబ్ - హర్యానా హైకోర్టు. కుక్క కాటు కేసులకు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని స్పష్టం చేయటమే కాదు.. కుక్క పంటిగాటుకు సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. బాధితులకు భారీ ఊరట ఇచ్చేలా మారిన ఈ తీర్పు.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించే వీలుందన్న మాట వినిపిస్తోంది. కుక్క పంటిగాటు ఒంటి మీద పడితే.. ఒక్కో గాటుకు రూ.10వేలు చొప్పున ప్రభేుత్వం బాధితులకు చెల్లించాలని చెప్పింది.
అంతేకాదు.. కుక్క గాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20వేలు ఫైన్ ను బాధితులకు చెల్లించాలని స్పష్టం చేసింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసులపై పంజాబ్.. హర్యానా హైకోర్టు విచారణ చేపట్టింది. వీధికుక్కల రచ్చ ఎక్కువ కావటం.. పలు రాష్ట్రాల్లో వీధి కుక్కల బారిన పలువురు పడటం.. కొందరు చిన్నారులైతే ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే.
తాజా కేసు విషయానికి వస్తే.. కొద్ది వారాల క్రితం "వాఘ్ బక్రీ" టీ గ్రూప్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (48)ను అక్టోబరులో వీధి కుక్కలు వెంబడించిన ఉదంతంలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ను వెంబడించగా.. ఆయన కింద పడిపోవటం.. తలకు గాయమై.. తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ కారణంగానే ఆయన మరణించి ఉంటారని ఆయనకు చికిత్స అందించిన ఆసుపత్రి పేర్కొంది.
ఈ విషాద ఉదంతం తర్వాత.. వీధికుక్కల బారి నుంచి కాపాడాలన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలో కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరిన హైకోర్టు.. జంతువుల దాడి కేసుల్లో చెల్లింపులు జరపాల్సిన వైనాన్ని తీర్పులో స్పష్టం చేశారు. ఈ జాబితాలో వీధి కుక్కలే కాదు.. ఆవులు.. ఎద్దులు.. గాడిదలు.. గేదెలు.. అడివి జంతువులతో పాటు.. పెంపుడు జంతువులు కూడా ఉండటం గమనార్హం. మొత్తానికి ఈ తీర్పును దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు కూడా ఫాలో అయితే బాగుండన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.