Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ కుటుంబం అదే .... ఆమె సంగతి అంతే...?

ఎన్టీయార్ ఫ్యామిలీ అంటే ఆయన మొదటి భార్య సంతానం వారి పిల్లలు ఆ తరువాత తరం అంతే. ఇదే ఖాయం కూడా.

By:  Tupaki Desk   |   31 Aug 2023 1:55 PM GMT
ఎన్టీయార్ కుటుంబం అదే .... ఆమె సంగతి అంతే...?
X

ఎన్టీయార్ ఫ్యామిలీ అంటే ఆయన మొదటి భార్య సంతానం వారి పిల్లలు ఆ తరువాత తరం అంతే. ఇదే ఖాయం కూడా. అయితే ఈ విషయంలో అభ్యంతరాలు లేవు కానీ ఎన్టీయార్ 1993లో బాహాటంగా జనాలకు చెప్పి వారి ముందు ఒక సినీ ఫంక్షన్ లో దండలు మార్చుకుని మరీ చేసుకున్న రెండవ పెళ్ళి ఒకటి ఉంది.

అలా రెండవ భార్యగా లక్ష్మీపార్వతి ఉన్నారు. ఆమెను మేము గుర్తించమని చెప్పకుండానే మొదటి ఫ్యామిలీ చెబుతోంది అని అంటున్నారు. నిజానికి లక్ష్మీపార్వతి ఎంట్రీతో ఏకంగా ఎన్టీయార్ మీదనే యావత్తు కుటుంబ సభ్యులు వ్యతిరేకతతో ఆయన ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు తెచ్చారు అన్నది పాత చరిత్రలో ఉన్న విషయం.

ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ విభేదాలు అలాగే ఉన్నాయి. పైగా ఏపీలో రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. టీడీపీలో మెజారిటీ ఎన్టీయార్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ప్రత్యర్ధి పార్టీగా ఉన్న వైసీపీలో ఎన్టీయార్ రెండవ భార్య లక్ష్మీపార్వతి ఉన్నారు. ఆమెకు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ పేరిట క్యాబినెట్ పొజిషన్ ని వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది.

అంతకు ముందు ఎన్టీయార్ మరణానంతరం ఆమె 1997 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్నాళ్ళు ఆమె శాసనసభ సభ్యూరాలిగా పనిచేశారు. అలా ఆమె రాజకీయ జీవితం వేరుగానే ఉంది. ఇక ఎన్టీయార్ కుటుంబం కూడా ఆమెను మొదటి నుంచి ఆమోదించి దగ్గరకు తీయలేదు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్టీయార్ బొమ్మతో ముద్రించిన వెండి నాణెం ఆవిష్కరణకు లక్ష్మీపార్వతిని పిలవకపోవడం మీద చర్చ సాగుతోంది. స్వయంగా లక్ష్మీపార్వతి అయితే మీడియా సమావేశం పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీయార్ తనను పెళ్ళి చేసుకున్నారని, ఆయన చివరి రోజులలో తానే ఆయన వెంట ఉన్నాను అని చెప్పుకున్నారు. అలాంటి తనను పిలవకపోవడం ఏంటి అని ఆమె ప్రశ్నించారు.

ఇక ఇదే విషయం మీద కాకపోయినా ఎన్టీయార్ వెండి నాణెం ఆవిష్కరణ కార్యక్రమం మీద రాజకీయంగా వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డి సజ్జల రామక్రిష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. ఇక ఇదే విషయం మీద మీడియా బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరిని అడిగినపుడు ఆమె తాను వారి కామెంట్స్ కి రెస్పాండ్ కాదచుకోలేదు అన్నారు. రాష్ట్రపతిభవన్ ని రాజకీయాలకు వాడడం మంచిది కాదని ఆమె అన్నారు.

ఇక ఎన్టీయార్ పేరిట వెండి నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్టీయార్ కుటుంబం మొత్తం హాజరైంది అని ఆమె అన్నారు. ఆయన కుమారులు కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, తరువాత తరం అంతా వచ్చారని ఆమె చెప్పారు. దీన్ని కూడా తప్పు పడతారా అని ఆమె మండిపడ్డారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఎన్టీయార్ కుటుంబం అంటే ఏమిటో ఎవరో తన మాటల ద్వారా మరోసారి పురంధేశ్వరి చెప్పారని అంటున్నారు. ఎన్టీయార్ ఫ్యామిలీ అంటే మొదటి భార్య సంతానం తప్ప రెండవ భార్య కానే కాదని ఆమె మాటల ద్వారా చేతల ద్వారా రుజువు చేశారు అని అంటున్నారు. మరి దీని మీద లక్ష్మీపార్వతి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.