Begin typing your search above and press return to search.

పురంధేశ్వరికి కూడా టీడీపీయేనట...?

అందులో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ తో సహా అని అనేశారు. అంటే పురంధేశ్వరి కూడా టీడీపీ మనిషే అని జగన్ ఆరోపించారు అన్న మాట.

By:  Tupaki Desk   |   10 Oct 2023 3:00 AM GMT
పురంధేశ్వరికి కూడా టీడీపీయేనట...?
X

దగ్గుబాటి పురంధేశ్వరి ఏ పార్టీ అంటే రాజకీయాలు మీకు తెలియవా లేక అర్ధం కావా అని ఎవరైనా రివర్స్ లో ప్రశ్నిస్తారు. ఆమె ఏపీ బీజేపీ ప్రెసిడెంట్. అంటే ఆమె జాతీయ పార్టీ నాయకురాలు అనే చెబుతారు. దానికి ముందు పురంధేశ్వరి ఉన్నది రాజకీయ అరంగేట్రం చేసినది కూడా కాంగ్రెస్ నుంచే.

చిత్రమేంటి అంటే పురంధేశ్వరి ఏపీ సీఎం జగన్ ఇద్దరూ కాంగ్రెస్ లో కొన్నాళ్ల పాటు కలిసే ఎంపీలుగా పనిచేశారు. ఇక వైఎస్సార్ ప్రోత్సాహంతోనే దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో 2004లో చేరారు. పురంధేశ్వరి పొలిటికల్ హిస్టరీ తిరగేస్తే ఆమె ఎపుడూ టీడీపీలో అయితే లేరు.

కానీ ముఖ్యమంత్రి జగన్ ఆమెను టీడీపీ మనిషిగానే జమ కట్టేస్తున్నారు. ఆయన పార్టీ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ ఏపీ బీజేపీలో సగానికి సగం మంది టీడీపీ మనుషులే ఉన్నారని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ తో సహా అని అనేశారు. అంటే పురంధేశ్వరి కూడా టీడీపీ మనిషే అని జగన్ ఆరోపించారు అన్న మాట.

అదేలా పాజిబుల్ అంటే వైసీపీ లెక్క వేరే ఉంది. పురంధేశ్వరి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక ఒక్క మాట కూడా టీడీపీని పొరపాటున కూడా అని ఎరగరు అంటున్నారు వైసీపీ నేతలు. ఏపీలో చూస్తే బీజేపీకి టీడీపీతో పొత్తు ఏమీ లేదు. ఎలాంటి మొహమాటాలు అంతకంటే లేవు.

కానీ పురంధేశ్వరి ప్రతీ దానికీ జగన్ మీద ఆయన పార్టీ మీదనే గట్టిగా మాట్లాడుతున్నారు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆమెను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా చేసింది కాషాయం పార్టీ అభివృద్ధి కోసమా లేక టీడీపీతో పొత్తుల కోసమా అన్న డౌట్లు సొంత పార్టీతో పాటు బయట వారికీ వస్తున్నాయని అంటున్నారు.

ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే అందరి కంటే ముందుగానే పురంధేశ్వరి ఖండించేశారు. ఇక్కడ ఆమె బాబుకు వదిన గారు కూడా అవుతారు. అలా దగ్గర బంధుత్వం కూడా ఉంది. మరో వైపు చూస్తే ఈ మధ్యనే ఎన్టీయార్ బొమ్మతో వెండి నాణేన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో నందమూరి నారా ఫ్యామిలీ అంతా రాష్ట్రపతి భవన్ లో కనిపించారు. అది ఒక ఎత్తు అయితే ఆ మీదట జేపీ నడ్డా దగ్గర చంద్రబాబు తో కలసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి కనిపించారు. దీంతోనే ఆమె టీడీపీ పట్ల మొగ్గు తో ఉన్నారని ప్రచారం సాగింది.

గతంలో సోము వీర్రాజు టీడీపీ వైసీపీ రెండూ మాకు దూరమే అంటూ వచ్చేవారు. పురంధేశ్వరి పొత్తుల విషయంలో కేంద్రానిదే నిర్ణయం అంటున్నారు తప్ప టీడీపీతో మాకేంటి పొత్తు అనడంలేదు. దీన్ని కూడా వైసీపీ నేతలు ఎత్తి చూపుతున్నారు. వీటన్నిటికీ మించి లేటెస్ట్ గా ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి మద్యం కుంభకోణం ఏపీలో జరుగుతోందని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో వైసీపీ మండిపోతోంది. అవన్నీ కలసే జగన్ నోట పురంధేశ్వరి టీడీపీ మనిషి ఆ పార్టీయే అని అనిపించాయని అంటున్నారు. మరి దీన్ని బీజేపీ నేతలు ఎంతవరకూ ఆక్సెప్ట్ చేస్తారో చూడాల్సి ఉంది.