కమ్మ వర్గానికి పురందేశ్వరి ఎంత వరకు కనెక్ట్ అవుతారో..!
మొత్తానికి పెద్ద వ్యూహంతోనే పురందేశ్వరిని రంగంలోకి దింపారనే చర్చ సాగుతుండడం గమనార్హం.
By: Tupaki Desk | 31 July 2023 5:30 PM GMTరాష్ట్ర బీజేపీ సారథిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పై పార్టీ అధిష్టానం ఆశలు బాగానే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం మాట ఎలా ఉన్నా.. పార్టీని బలమైన ప్రతిపక్షంగా అయితే.. కూర్చోబెట్టాలనే లక్ష్యంతో బీజేపీ అగ్రనాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా అంచనాల నడుమ పురందేశ్వరిని రంగంలోకి దింపారనే చర్చ సాగుతోంది.
ప్రధానంగా రాజకీయాల్లో కీలకమైన రెండు సామాజిక వర్గాలు.. కమ్మ, రెడ్డి. ఈ రెండింటిలోనూ.. రెడ్డి సామాజి క వర్గం వైసీపీకి అనుకూలంగా ఉండగా, కమ్మ సామాజిక వర్గం టీడీపీకి దన్నుగా ఉందనేది తెలిసిన విషయమే. అయితే.. ఇవి కాకుండా.. కాపులను తమవైపు తిప్పుకోవాలని భావించిన బీజేపీ రెండు ప్రయోగాలు చేసింది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత సోము వీర్రాజులకు.. పార్టీ పగ్గాలు అప్పగించింది. అయితే.. వారు ఈ విషయంలో సక్సెస్ సాధించలేక పోయారు.
దీనికితోడు కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ ఎలానూ తమతోనే ఉన్నాడనే ధీమా బీజేపీ పెద్దల్లోనూ ఉంది. ఇక, రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న జగన్.. కూడా తమకు అనుకూలంగా ఉన్నారని.. తమకు అన్న విధాలా సహకరిస్తున్నారని.. ఢిల్లీ వర్గాల్లోనే చర్చ సాగుతుండడం గమనార్హం. దీంతో కాపు, రెడ్లు.. కూడా బీజేపీకి సానుకూలమనే లేకపోయినా.. తమ మిత్రులకు సానుకూలమనే భావనతో బీజేపీ ఉంది.
ఇక, ఎటొచ్చీ.. కమ్మవర్గంపైనే.. బీజేపీ లెక్కలు, అంచనాలు వేరేగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో అ దే వర్గానికి చెందిన అన్నగారి కుమార్తెకు పార్టీ పగ్గాలు అప్పగించారని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె పదవి చేపట్టి 15 రోజులు కూడా గడవకముందే.. గ్రాఫ్ ఎలా ఉంది? ఆమె పెడుతున్న సభలు.. మీడియా సమావేశాలకు కమ్మ వర్గం ఆదరణ ఎలా ఉందనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయంపై తాజాగా బీజేపీ అధిష్టానం కూడా.. ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమ్మ నేతల చేరిక, వారి ఓటు బ్యాంకు వంటివి కూడా.. పార్టీ నేతల చర్చల్లో వస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి పెద్ద వ్యూహంతోనే పురందేశ్వరిని రంగంలోకి దింపారనే చర్చ సాగుతుండడం గమనార్హం.