ఏపీ బీజేపీ.. పురందేశ్వరి రూటే సెపరేటు.. !
జంపింగ్‌లపై దృష్టి పెట్టడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని.. సభ్యత్వాలపై దృష్టి పెట్టి.. పార్టీ పుంజుకునేలా చేయాలని వారు కోరుతున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 8:30 AM GMTబీజేపీ ఏపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి సీనియర్ నాయకుల నుంచి మరో సెగ మొదలైంది. ఆడారి ఆనంద్‌కుమార్‌ను పార్టీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిని విశాఖ బీజేపీ నాయకులు హర్షించడం లేదు. ఆయన వల్ల పార్టీకి ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. జంపింగ్‌లపై దృష్టి పెట్టడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని.. సభ్యత్వాలపై దృష్టి పెట్టి.. పార్టీ పుంజుకునేలా చేయాలని వారు కోరుతున్నారు.
అయితే.. సభ్యత్వాల విషయాన్ని క్షేత్రస్థాయి నాయకులకు వదిలేసిన పురందేశ్వరి.. తాను మాత్రం జంపింగులపై వల విసురుతున్నారు. ఎవరైనా ఉంటే వచ్చేలా చూడండి! అని తన కోటరీ నాయకులకు చెబుతున్నారు. మరోవైపు.. సీనియర్లు ఈప్రతిపాదనను తప్పుబడుతున్నారు. వారిని సమన్వయం చేసుకుని ముందుకు సాగడంలో చిన్నమ్మ విఫలమవుతున్నారు. ప్రస్తుతానికి అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో పైకి ఏమీ మాట్లాడకపోయినా.. పురందేశ్వరి అంతర్మథనం చెందుతున్నారు.
పైగా.. పురందేశ్వరి ప్రమేయం లేకుండానే కొందరు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా ఆమెకు ఇబ్బందిగానే ఉంది. ``పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాల్సి ఉంది. హిందూత్వకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అసలు పార్టీ నాడిని తెలుసుకోవడంలో కొందరు విఫలమవుతున్నారు`` అని సోము వీర్రాజు వంటి వారు ఆక్షేపిస్తున్నారు. ఇది పురందేశ్వరిని టార్గెట్ చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలేనన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే.. కేంద్రంలోని కీలక నేతల దన్ను ఉన్న కారణంగా ఆమెను నేరుగా ఎవరూ ఏమీ అనకపోయినా.. మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాదితో ఏపీ చీఫ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆమెను తప్పించేదిశగా ప్రయత్నాలు కూడాసాగుతున్నాయి. మరోవైపు.. చిన్నమ్మ కూడా.. కేంద్రంలో ఏదో ఒక మంత్రి పదవి ఇస్తే.. చాలన్నట్టుగా ఎక్కువ భాగం ఢిల్లీలోనే ఉంటూ.. అక్కడప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో సభ్యత్వ నమోదులో పార్టీ వెనుక బడిపోయింది. ఈ పరిణామాలతో క్షేత్రస్థాయి నాయకులు.. ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారనేది పార్టీలో జరుగుతున్న చర్చ.