బీజేపీలోకి విజయసాయి...పురంధేశ్వరి కామెంట్స్ వైరల్ !
ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెబుతూ సుదీర్ఘంగా పెట్టిన ట్వీట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాల గురించి గొప్పగా చెప్పారు.
By: Tupaki Desk | 25 Jan 2025 4:15 PM GMTవైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న వి విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అన్న ప్రచారం ఒక వైపు జోరుగా సాగుతోంది. ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెబుతూ సుదీర్ఘంగా పెట్టిన ట్వీట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాల గురించి గొప్పగా చెప్పారు.
ఆ ఇద్దరూ తనను విశేషంగా ప్రోత్సహించారు అని ఆయన అంటూ ధన్యవాదాలు తెలిపారు. దాంతో విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారు అన్న ప్రచారం అయితే ఊపందుకుంది. అది అలా సాగుతూ వస్తోంది. గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాను ఇదే ఊపేస్తోంది.
అయితే వైసీపీలో ఉంటూ జగన్ తరువాత అంతటి స్థాయిలో టీడీపీని వ్యతిరకించిన విజయసాయిరెడ్డి కూటమిలో కేంద్రంలో కీలకంగా ఉంటూ పెద్దన్న పాత్రలో ఉన్న బీజేపీలో చేరుతారు అన్న వార్తల పట్ల ఏపీ పాలిటిక్స్ లోనూ తీవ్రమైన చర్చ సాగుతోంది.
అదే జరిగితే విజయసాయిరెడ్డి కూటమిలో మిత్రుడు అవుతారు. అలా ఆయనతో పనిచేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న వర్గాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను అని మీడియా సమావేశం పెట్టి మరీ విజయసాయిరెడ్డి చెప్పారు.
అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే కాబట్టి ఆయన బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం కూడా బలంగానే ఉంది. అటువంటి వాటికి ఏపీ బీజేపీ చీఫ్ హోదాలో పురంధేశ్వరి చెక్ పెట్టేశారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడం లేదు అని ఆమె అన్నారు.
ఆయన పార్టీలో చేరుతారు అన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆమె కోరారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా చెప్పారా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ లో ప్రతీ సభ్యుడికీ మోడీ అమిత్ షా మద్దతుగా ఉంటారు అని ఆమె అన్నారు.
అందుకే వారికి ధన్యవాదాలు చెబుతూ తనకు మద్దతుగా నిలిచారు అని విజయసాయిరెడ్డి చెప్పారని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డిని పురంధేశ్వరి ఒక సాధారణ సభ్యుడిగా చెబుతూ ఈ ట్వీట్ చేశారని అంటున్నారు. కానీ ఆయన ఎనిమిదేళ్ళ పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. అలా కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు.
ఆయనకు ఎపుడు కావాల్సి వస్తే అపుడు కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేవారు. ఆయన పలుకుబడి ఎలాంటిది అంటే ఏపీలో కూటమి ఏర్పడిన ఈ ఏడు నెలల కాలంలోనే అనేకసార్లు ఆయన అమిత్ షాతో భేటీలు వేసి అనేక విషయాలు చర్చించారు. ఇలా విజయసాయిరెడ్డి అతి తక్కువ సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వంతో మంచి బంధాన్నే పెనవేసుకున్నారు అన్నది అందరూ చెబుతారు.
అందుకే ఆయన బీజేపీలో చేరుతారు అన్న ప్రచారం ఊపందుకుంది. అయితే దీని మీద పురందేశ్వరి ఇపుడు ఎందుకు ఖండించాల్సి వచ్చింది అన్నదే చర్చగా ఉంది. పార్టీల నుంచి చాలా మంది రాజీనామాలు చేసి బయటకు వెళ్తారు అలా వెళ్ళిన వారు ఏదో ఒక పార్టీలో చేరుతారు. కానీ వారు మా పార్టీలో చేరరు అని ఏ రాజకీయ నేత కూడా ప్రకటనలు చేసిన సందర్భాలు లేవు.
ఇక్కడ చిత్రమేంటి అంటే విజయసాయిరెడ్డి తాను రాజకీయ సన్యాసం పుచ్చుకున్నాను అని. అంటే ఆయన రాజకీయలే వద్దు అంటున్న వేళ కూడా ఆయన బీజేపీలో చేరడం లేదు అని చెప్పడం అంటే ఎక్కడో ఏదో జరుగుతోంది అన్న డౌట్లు అయితే వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు.