మస్క్‌కు ఇచ్చి పడేసిన పురందేశ్వరి!
''మస్క్ ను ఎన్నికల సంఘం భారత్ కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్ కు అవకాశమివ్వాలి'' అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 17 Jun 2024 4:57 PM GMTఎలాన్ మస్క్. టెస్లా కార్ల కంపెనీ యజమానే కాకుండా.. సోషల్ మీడియా ఎక్స్ అధినేత కూడా. ప్రపంచ కుబేరిడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అయితే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని కోరుకునే ఆయన.. తాజాగా ఎన్నికల ఓటింగ్ యంత్రాలైన ఈవీఎంలపై పడ్డారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని.. వీటిని నమ్మరాదని రెండు రోజులుగా ఆయన వరుస వ్యాఖ్యలు చేస్తున్నా రు. ఆయన ఉద్దేశం ఏదైనా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈవీఎంల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్యూర్టోరికో దేశంలో కూడా ఈవీఎంల వ్యవహారం కలకలం రేపింది.
ఇక, మన దేశంలోని మహారాష్ట్రలోనూ.. ఈవీఎంలపై అనుమానాలు రావడం.. ఓ మీడియా పెద్ద ఎత్తున ఈ తప్పులను ఎత్తి చూపడం తెలిసిందే. దీంతో మస్క్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. సోషల్ మీడియాలో మస్క్ వ్యాఖ్యలపై చర్చ కూడా సాగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఏపీ సారథి, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. మస్క్‌కు గట్టి సవాల్ రువ్వారు. ఒక రకంగా ఆయన ఇచ్చి పడేశారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మస్క్ వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు.
''మస్క్ ను ఎన్నికల సంఘం భారత్ కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్ కు అవకాశమివ్వాలి'' అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ ఇప్పటికే చాలామందికి అవకాశం ఇచ్చిందని ఆమె తెలిపారు. ఇంత అవకాశం ఇచ్చినా.. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చన్న విషయాన్ని ఎవరూ నిరూపించలేక పోయారని తెలిపారు. ఇప్పుడు మస్క్ కూడా.. ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నందున ఆయనను ఇండియాకు పిలిచి.. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో.. చెబితే.. ఆ పాఠాలు అందరూ నేర్చుకుంటారని వ్యాఖ్యానించారు.