Begin typing your search above and press return to search.

బీజేపీకి చిన్నమ్మ...టీడీపీకి పెద్దమ్మ...!

ఏపీ బీజేపీలో అసలైన కాషాధారులు అయితే ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 5:34 AM GMT
బీజేపీకి చిన్నమ్మ...టీడీపీకి పెద్దమ్మ...!
X

ఆమె నందమూరి తారక రాముని మూడవ కుమార్తె. ఇంట్లో ముచ్చటగా చిన్నమ్మ అని పిలుస్తారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎపుడూ రాజకీయాల్లోకి రాలేదు. తన భర్త రాజకీయంగా చురుకుగా ఉన్న టైం లోనూ కనిపించలేదు. 2004లో కాంగ్రెస్ లో ఎంట్రీ ఇచ్చి రెండు దఫాలు ఆ పార్టీ ద్వారా ఎంపీ అయి కేంద్ర మంత్రి పదవిని పొందిన ఆమె దగ్గుబాటి పురంధేశ్వరిగా అందరికీ పరిచయం.

ఎపుడైతే ఏపీలో కాంగ్రెస్ కుదేల్ అయిందో ఏ మాత్రం సంకోచించకుండా బీజేపీ వైపు ఆమె అడుగులు వేశారు. బీజేపీలో రాజ్యసభ కేంద్ర మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నా ఆమె కోరిక తీరలేదు. అయితే 2024 ఎన్నికల ముందు ఆమె సామర్థ్యం నిరూపించుకునేందుకు కీలకమైన ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఇచ్చారు.

మరి చిన్నమ్మ ఈ పదవిలో ఎంతలా దూకుడు చేయాలి. బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు అయింది. బీజేపీ బండి ఆమె సారధ్యంతో ఎక్కడ పరుగులు పెడుతోందో తెలియదు కానీ ఆమె అడుగడుగునా టీడీపీకి మాత్రం అండగా ఉంటూ వస్తున్నారు అన్న ఆరోపణలను మాత్రం ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో బంధుత్వాలకు తావు లేవు.

అభిమానం వేరు, పార్టీ బాధ్యతలు వేరు. ఆమె ఈ రెండింటినీ బాలెన్స్ చేసుకోవడంలో తడబడుతున్నారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఆమె టీడీపీ కోసం వాడుతున్నారా అన్న చర్చ కూడా మొదలైంది. ఎన్టీయార్ బొమ్మతో వెండి విగ్రహావిష్కరణ సమయంలోనూ ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత తన మరిది గారు అయిన చంద్రబాబుని కలిపి ఆసక్తికరమైన భేటీ వేయించారు.

ఇపుడు మరోమారు ఆమె తన పలుకుబడిని బీజేపీలో ఉపయోగించి టీడీపీ యువ నేత నారా లోకేష్ ని ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందు పెట్టగలిగారు అన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హో మంత్రితో నారా లోకేష్ భేటీ అయితే ఆ పక్కనే పురంధేశ్వరి కూర్చున్న సన్నివేశం ఫోటో రూపంలో బయటకు వచ్చింది.

ఆమె నారా లోకేష్ కి పెద్దమ్మ అవుతారు. చెల్లెలు భువనేశ్వరి. భర్త, తనకు మరిది అయిన చంద్రబాబు నెల రోజులుగా జైలులో ఉన్నారన్న బాధ ఆవేదన ఆమెకు నిండా ఉండవచ్చు. కానీ ఈ రోజుకు చూస్తే ఏపీలో బీజేపీ టీడీపీకి ఏ రకమైన రాజకీయ బంధుత్వం లేదు. కానీ పురంధేశ్వరి చుట్టరికంతో ఈ రెండు పార్టీలు కలసిపోయాయా అన్న చర్చ అయితే వస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పురంధేశ్వరి ఉత్సాహం చూపిస్తున్నారు అన్న ప్రచారం ఒక వైపు ఉండనే ఉంది. ఈ లోగా బాబు అరెస్ట్ తో ఆమె జోరు పెంచారు. బాబు అరెస్ట్ అయిన వెంటనే ఖండించారు. బీజేపీ అవినీతిపరులను వెనకేసుకుని రాదు అన్న మూల సూత్రం తెలిసినా కూడా బంధుత్వాన్ని ఆమె దాటలేకపోతున్నారు అని అంటున్నారు.

ఇపుడు అదే తపన తాపత్రయంతో ఆమె అమిత్ షాతో తన చెల్లెలు కుమారుడు లోకేష్ ని భేటీ వేయించారు అని అంటున్నారు. ఒక విధంగా ఆమె బీజేపీకి చిన్నమ్మగా టీడీపీకి పెద్దమ్మగా వ్యవహరిస్తున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది.

ఇక అమిత్ షాతో భేటీ తరువాత పురంధేశ్వరి చేసిన ట్వీట్ కూడా ఇపుడు కొత్త చర్చకు తెర లేపింది. ఏపీలో రాజకీయ కక్షతో చంద్రబాబుని అరెస్ట్ చేశారు అని ఆమె అంటున్నారు. ఆ విషయాన్ని లోకేష్ అమిత్ షాకు వివరించారు అని కూడా చెబుతున్నారు. రాజకీయ కక్ష అయితే కోర్టులు ఎలా రిమాండ్ విధిస్తాయో మాత్రం ఆమె చెప్పలేకపోతున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఆమె బీజేపీలో ఉంటూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఇదిలా ఉంటే కేంద్ర బీజేపీ పెద్దలు పురంధేశ్వరిని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమించడం వెనక టీడీపీని పక్కన పెట్టి సొంతంగా ఎదగాలన్న ఆలోచన ఉంది. కానీ దాన్ని చిన్నమ్మ వేరే విధంగా అర్ధం చేసుకున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. టీడీపీతో పొత్తు బీజేపీకి కావాల్సి వస్తే చిన్నమ్మకే ఆ పోస్ట్ ఎందుకు ఎవరికి ఇచ్చినా పొత్తులు నాలుగు సీట్లు దక్కుతాయి కదా.

ఏపీలో బీజేపీకి ఒక బలమైన సామాజికవర్గాన్ని దగ్గర చేయడం ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తారని చిన్నమ్మకు పదవి ఇస్తే ఆమె బంధుప్రీతితో వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీ బీజేపీలో అసలైన కాషాధారులు అయితే ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

టీడీపీ వీక్ అయిన చోట అవకాశాన్ని అందుకోవాల్సిన చోట బీజేపీని పక్కన పెట్టి టీడీపీ కోసం తన బంధువుల కోసం చిన్నమ్మ చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా బీజేపీని ఏపీలో కోలుకోలేని దెబ్బ తీస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా రానున్న రోజులల్లో చిన్నమ్మ పనితీరు మీద కేంద్ర బీజేపీ నాయకత్వం మధింపు చేస్తుందని అంటున్నారు.