Begin typing your search above and press return to search.

బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి ?

ఇక ఈ పదవి విషయంలో ప్రధానంగా మూడు పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 3:38 AM GMT
బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి ?
X

అన్న గారి ఇంటి ఆడపడుచు రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం నిండుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి మూడు సార్లు ఎంపీగా గెలిచిన దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా చేస్తారు అని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర ప్రభుత్వంలో చేరిపోయారు. ఆయన 2020 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నారు.

ఆయన స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవడానికి బీజేపీ చూస్తోంది. ఇదిలా ఉంటే నాడు జనసంఘ్ లో కానీ నేటి బీజేపీలో కానీ అంతా మగవారే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మహిళలకు అవకాశం అసలు ఎక్కడా లేదు. అదే కాంగ్రెస్ లో అయితే ఇందిరా గాంధీ సోనియా గాంధీ వంటి వారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

మహిళా బిల్లు ఆమోదించామని చెబుతూ వస్తున్న బీజేపీ మహిళలకు తమ పార్టీలో సముచిత స్థానం ఉంది అని నిరూపించుకోవడానికి చూస్తోంది అని అంటున్నారు. బీజేపీ ఏర్పాటు అయి 45 ఏళ్ళు అయిన తరువాత అయినా తొలిసారిగా మహిళలకు ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది అంటే మంచి పరిణామమే అని అంటున్నారు.

ఇక ఈ పదవి విషయంలో ప్రధానంగా మూడు పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. అందులో దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కీలకంగా ఉంది అని అంటున్నారు. బీజేపీకి ఇక భవిష్యత్తు అంతా దక్షిణాదినే చూసుకోవాల్సి రావడంతో అందులోనూ తెలుగు రాష్ట్రాలలో పాగా వేయాలని ఆలోచిస్తున్న క్రమంలో ఏపీకి చెందిన పురంధేశ్వరికి జాతీయ బాధ్యతలు అప్పగిస్తే ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల మీద ఉంటుందని పార్టీ ఆలోచిస్తోందిట.

అన్న గారి కుమార్తెగా రెండు చోట్ల బలమైన సామాజిక వర్గం ప్రభావితం అవుతారని అలాగే బీసీలు ఇతర సామాజిక వర్గాల వారిని తమ వైపు తిప్పుకోవచ్చునని బీజేపీ యోచిస్తోంది అని అంటున్నారు. అందుకే ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఈసారి ఇవ్వలేదు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ పదవి కోసం కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఆమె 2019లో అమేధీ నుంచి రాహుల్ గాంధీని ఓడించి మోడీ ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆమె ఓటమి పాలు అయ్యారు. ఆమె చురుకైన రాజకీయ నేత కావడం, యూపీకి చెందిన వారు కావడంతో అక్కడ ఈసారి బీజేపీ బలం తగ్గడంతో పోయిన చోట వెతుక్కోవాలి అన్న రాజనీతిని అమలు చేస్తే మాత్రం ఆమె కొత్త ప్రెసిడెంట్ అవుతారు అని అంటున్నారు.

ఇక రాజస్థాన్ కి ఈ మధ్య దాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధరా రాజే సింధియా పేరుని కూడా పార్టీ సీరియస్ గా పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఆమె సీనియర్ నేత కావడంతో పాటు రాజస్థాన్ వంటి చోట్ల బీజేపీ బలం పుంజుకోవడానికి ఆమెకు అవకాశం ఇస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ ముగ్గురిలో పురంధేశ్వరికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.