Begin typing your search above and press return to search.

చిన్నమ్మకు చెక్ పెట్టిందెవరు ?

కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరికి చెక్ పెడుతున్నది ఎవరు అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 3:34 AM GMT
చిన్నమ్మకు చెక్ పెట్టిందెవరు ?
X

కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరికి చెక్ పెడుతున్నది ఎవరు అన్న చర్చ సాగుతోంది. ఆమె ఈసారి తప్పనిసరిగా కేంద్ర మంత్రి అవుతారని అంతా భావించారు. ఆమె సైతం రాజమండ్రీలో భారీ మెజారిటీతో గెలిచి వచ్చారు.

దాంతో ఆమెకు కేబినెట్ ర్యాంక్ తో మంచి శాఖ ఇస్తారని అనుకున్నారు. తీరా చూస్తే కేంద్ర మంత్రి మండలిలో అనూహ్యమైన పేర్లు కనిపించాయి. బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మను తీసుకున్నారు. అలా చిన్నమ్మకు కేంద్ర మంత్రి పదవి దక్కకుండా పోయింది.

దాంతో పాటుగానే కొత్త ప్రచారానికి తెర లేచింది. ఆమెను స్పీకర్ పదవికి ఎంపిక చేయడానికే ఇదంతా అని అన్నారు. ఆమె దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగ పదవికి ఎంపిక కాబోతున్నారు అని గత పది రోజులుగా ప్రచారం హోరెత్తింది. అనేక రకాలైన పేర్లు వినిపించినా సౌత్ ఇండియాకు ఈసారి ప్రాధాన్యత ఇస్తారని అందులో ఏపీ నుంచి పురంధేశ్వరి ఉంటారని లెక్కలేశారు.

పైగా ఆమె స్వర్గీయ ఎన్టీఆర్ తనయ కావడంతో పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉందని అన్నారు. సీన్ కట్ చేస్తే గత అయిదేళ్ల పాటు స్పీకర్ గా పనిచేసిన ఓం బిర్లాకే చాన్స్ ఇచ్చారు. దాంతో చిన్నమ్మకు ఏ పదవీ లేదా అన్న డిస్కషన్ సాగుతోంది.

అయితే ఆమెకు పదవులు రాకుండా తెర వెనక చక్రం తిప్పుతున్నది ఎవరూ అన్న చర్చకు తెర లేచింది.ఏపీలో బీజేపీలోనే ఆమెకు గిట్టని వారు ఉన్నారని వారి నిర్వాకమేనా ఇదంతా అన్న మాటా వినిపిస్తోంది. బీజేపీ పెద్దలు మాత్రం పార్టీ కోసం మొదటి నుంచి పని చేసి అచ్చమైన బీజేపీ నేతలకే పదవులు ఇస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి సేవలను ఉపయోగించుకుంటున్నారని పైగా ఇపుడు బీజేపీకి సొంత మెజారిటీ లేనందువల్ల పార్టీ పటిష్టంగా ఉండాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి ఉన్న వారికే అవకాశాలు ఇస్తున్నారు అని అంటున్నారు. కేవలం పురంధేశ్వరి విషయంలోనే ఇలా జరగలేదని తెలంగాణలో ఈటెల రాజేందర్ కి కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.

అక్కడ పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు పదవులు ఇచ్చారని చెబుతున్నారు. ఏది ఏమైనా రాజకీయంగా కీలక దశలో ఉన్న పురంధేశ్వరికి ఈ టెర్మ్ లో పదవులు దక్కుతాయా లేదా అన్న డిస్కషన్ అయితే సాగుతోంది.