కోల్డ్ వార్... వీర్రాజు - పురందేశ్వరి వ్యవహారంతో టీడీపీలో టెన్షన్ ఇదే!!
ప్రస్తుతం ప్రత్యర్థుల కంటే ఇంటర్నల్ ప్రత్యర్థులతోనే ఎక్కువ సమస్యలు అనే చర్చ ప్రధానంగా ఏపీ బీజేపీలో నడుస్తుందని తెలుస్తుంది
By: Tupaki Desk | 25 March 2024 7:46 AM GMTప్రస్తుతం ప్రత్యర్థుల కంటే ఇంటర్నల్ ప్రత్యర్థులతోనే ఎక్కువ సమస్యలు అనే చర్చ ప్రధానంగా ఏపీ బీజేపీలో నడుస్తుందని తెలుస్తుంది. సాధారణంగా... ఏపీ బీజేపీలో రెండు రకాల నాయకులు ఉంటారని, వారిలో కొంతమంది ఒరిజినల్ బీజేపీ నేతలు కాగా, మరికొంతమంది ఇతర లక్ష్యాలతో పార్టీలో చేరిన వలస నేతలు అని అంటుంటారు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రకటించిన లోక్ సభ అభ్యర్థుల జాబితా అనంతరం పార్టీలో సరికొత్త పరిణామలు తెరపైకి వస్తోన్నాయని అంటున్నారు.
అవును... కూటమిలో భాగంగా ఏపీ బీజేపీకి ఆరు లోక్ సభ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజగా ఆ ఆరు ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ అధిష్టాణం. అయితే ఆ అభ్యర్థుల జాబితాను ఎంపిక చేసే విషయంలో పురందేశ్వరి రూపంలో చంద్రబాబు పాత్ర ఉందని ఒకరంటుంటే... సోము వీర్రాజు రూపంలో జగన్ పాత్ర కూడా ఉందని తాజాగా రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా... ఆరు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అయ్యింది.
ఇందులో భాగంగా... అనకాపల్లి టిక్కెట్ సీఎం రమేష్ కు దక్కగా, అరకు - కొత్తపల్లి గీత, తిరుపతి - వరప్రసాద రావు, రాజాంపేట - కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించగా.. రాజమాండ్రి టిక్కెట్ దగ్గుబాటి పురందేశ్వరికి, అనూహ్యంగా నరసాపురం టిక్కెట్ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు. నరసాపురంలో రఘురామ సంగతి కాసేపు పక్కనపెడితే... రాజమండ్రిలో మాత్రం పురందేశ్వరి సంతృప్తిగా లేరని, అందుకు కారణం సోము వీర్రాజు అని తెలుస్తోంది.
వాస్తవానికి రాజమండ్రి లోక్ సభ టిక్కెట్ కోసం ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు! అయితే తాజా చర్చల్లో భాగంగా... వీర్రాజుని అసెంబ్లీకి పోటీ చేయించేందుకు ఇప్పించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు పోటీ చేసే స్థానంపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది. అందుకు ప్రధాన కారణం... పురందేశ్వరి పోటీచేసే లోక్ సభ పరిధిలో ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ కేటాయించడం అని అంటున్నారు.
వాస్తవానికి కూటమిలో భాగంగా అనపర్తి టిక్కెట్ టీడీపీకి కేటాయించారు. ఇందులో భాగంగా... అనపర్తి నుంచి కూటమి అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బరిలోకి దిగనున్నారు. అయితే... తాజాగా ఆ స్థానం ఇప్పుడు బీజేపీకి మారనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించి, అక్కడ నుంచి సోము వీర్రాజు బరిలోకి దిగుతారని సమాచారం. అయితే... వీర్రాజుకు అనపర్తి టిక్కెట్ ఇస్తే ఆ ప్రభావం రాజమండ్రి లోక్ సభ స్థానంపై ఉంటుందని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట.
సామాజికవర్గాల పరంగా చూస్తే... అనపర్తి నియోజకవర్గంలో రెడ్లు, ఎస్సీలు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో 55,207 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో... ఇప్పటికే అక్కడ రెడ్లు, ఎస్సీలు ఎక్కువగా ఉండటం తనకొక సమస్య అయితే.. అక్కడ వీర్రాజు పోటీ ఇంటర్నల్ గా మరింత పెద్ద సమస్య అయ్యే అవకాశాలున్నాయని పురందేశ్వరి భావిస్తున్నట్లు చెబుతున్నారు!
మరోపక్క మిగిలిన అసెంబ్లీ టిక్కెట్ల విషయానికొస్తే... జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి, విజయవాడ వెస్ట్ - సుజన చౌదరి, కైకలూరు - కామినేని శ్రీనివాస రావు, విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు, ధర్మవరం – సత్యకుమార్ ల పేర్లు ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తుండగా... అనపర్తి టిక్కెట్ విషయంలో ఎలాంటి పరిణామాలు తెరపైకి రాబోతున్నాయనేది వేచి చూడాలి!