Begin typing your search above and press return to search.

విశాఖ సెంటిమెంట్ ని నమ్ముకున్న పురంధేశ్వరి... ?

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ సెంటిమెంట్ ని బాగా నమ్ముకుంటున్నారు అని అంటున్నారు. ఆమె జాతకాన్ని మార్చిన సీటుగా విశాఖ ఉంది.

By:  Tupaki Desk   |   6 Sep 2023 5:06 PM GMT
విశాఖ సెంటిమెంట్ ని నమ్ముకున్న పురంధేశ్వరి... ?
X

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ సెంటిమెంట్ ని బాగా నమ్ముకుంటున్నారు అని అంటున్నారు. ఆమె జాతకాన్ని మార్చిన సీటుగా విశాఖ ఉంది. 2009 ఎన్నికల్లో పురంధేశ్వరి విశాఖ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అలా ఆమెకు అనూహ్యమైన పేరు పదవిని విశాఖ తీసుకుని వచ్చింది. కాంగ్రెస్ లో జూనియర్ అయినా సీనియర్ మోస్ట్ లీడర్స్ ఆనాటికి కావూరు సాంబశివరావు వంటి వారు ఉన్నా కూడా పురంధేశ్వరికి చాలా ముందుగానే కేంద్ర మంత్రి పదవి దక్కింది.

అయితే విభజన తరువాత కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టేసి బీజేపీలోకి చిన్నమ్మ వచ్చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తనకు రాజ్యసభ సీటు ఇచ్చి మరీ కేంద్ర మంత్రిని చేస్తుందని ఆమె పెట్టుకున్న ఆశలు తొమ్మిదేళ్ళు గడచినా తీరలేదు. ఈ లోగా ఆమెకు రెండు చోట్ల రెండు సార్లు లోక్ సభకు బీజేపీ టికెట్ ఇచ్చి మరీ పోటీ చేయించింది.

2014లో టీడీపీ పొత్తు, జనసేన మద్దతు కూడా చిన్నమ్మను ఎంపీగా చేయలేకపోయాయి. ఆనాడు ఆమె విశాఖ ఎంపీ సీటు అడిగినా వైసీపీకి కంచుకోట లాంటి రాజంపేట సీటు ఇచ్చారు. దాంతో ఆమె ఓటమి పాలు అయ్యారు. 2019 వచ్చేనాటికి పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగారు. అపుడు ఆమె కోరుకున్న విశాఖ సీటు దక్కినా డిపాజిట్లు అయితే దక్కలేదు.

ఇక 2024లో పొత్తులు ఉంటాయన్న ఆశ ఉంది. దాంతో పురంధేశ్వరి విశాఖ సీటు మీద కన్నేశారు అని ప్రచారం సాగుతోంది. విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధిస్తే మోడీ నాయకత్వంలో మూడవసారి కేంద్రంలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వంలో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చు అన్న అంచనాలలో ఆమె ఉన్నారని అంటున్నారు.

తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఆమె మద్దతు ఇస్తున్నారు అని అంటున్నారు. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర స్థాయిలో కాబట్టి ఆశలు నెరవేరడానికి సమయం ఉంది అంటున్నారు. బీజేపీ కనుక పొత్తులకు ఓకే అంటే పురంధేశ్వరి పంట పండినట్లే అంటున్నారు. ఆమె విశాఖ నుంచి పోటీకి ఎవరూ ఆపలేరని అంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు 2014 టైం లో దగ్గుబాటి ఫ్యామిలీ పట్ల కాస్తా గ్యాప్ తో దూరం పాటించారు. అందువల్లనే ఆమె రాజం పేట నుంచి పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. ఇపుడు చంద్రబాబుతో పొత్తుకు కేంద్ర పెద్దలను ఒప్పించే పనిలో పురంధేశ్వరి బిజీగా ఉన్నారని అంటున్నారు. దాంతో పొత్తులు కనుక కుదిరితే వదినగారు కోరుకున్న సీటు ఇచ్చి గెలిపించే బాధ్యతను కూడా మరిదిగారు తీసుకుంటారు అని అంటున్నారు.

మరి ఏపీ వరకూ చూస్తే లైన్ క్లియర్ గానే ఉంది. కానీ బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తులు అడ్డం కొడితే మాత్రం పురంధేశ్వరికి రాజకీయంగా ఇబ్బందులు మొదలైనట్లే అంటున్నారు. ఈ దఫా పోటీ చేసి అయిదేళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి తన వారసుడికి రూట్ సెట్ చేయాలని ఆమె ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా కూడా సున్నిత మనస్కుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇమడలేకపోయారు.

దాంతో నారా ఫ్యామిలీతో సమానంగా రాజకీయంగా పటిష్టంగా ఉండాల్సిన దగ్గుబాటి ఫ్యామిలీ ఇపుడు ఇబ్బందులు పడుతోంది అని అంటున్నారు. ఆ లోటుని భర్తీ చేసేందుకే పురంధేశ్వరి ఇపుడు రాజకీయాల్లో కొనసాగుతున్నారు అని అంటున్నారు. హితైష్ ని 2029 నాటికైనా రాజకీయంగా గట్టి లీడర్ గా చేయాలన్న చిన్నమ్మ కోరిక కేంద్ర మంత్రి టార్గెట్ అన్నీ విశాఖ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.