Begin typing your search above and press return to search.

భారత్ కు పుతిన్..ఉక్రెయిన్ పై మాట్లాడతారా? ఆ వేడుకలో పాల్గొంటారా?

తమ అధ్యక్షుడిని భారత్ లో పర్యటించాల్సిందిగా మోదీ పంపిన ఆహ్వానం తమకు అందిందని రష్యా రాయబార కార్యాలయం పేర్కొంది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 9:48 AM GMT
భారత్ కు పుతిన్..ఉక్రెయిన్ పై మాట్లాడతారా? ఆ వేడుకలో పాల్గొంటారా?
X

దాదాపు మూడేళ్ల కిందట ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన దగ్గర నుంచి రష్యా అధ్యక్షుడు బయట దేశాల్లో కాలుపెట్టలేదు. ఉత్తర కొరియా వంటి మిత్ర దేశంలో, ఆ తర్వాత పాత సోవియట్ యూనియన్ కాలం నాటి దేశాల్లో మాత్రమే పుతిన్ పర్యటనలు చేశారు. ఇక ఏ ఇతర దేశానికీ ఆయన వెళ్లలేదని చెప్పవచ్చు.

మోదీ, జింగ్ పిన్ వెళ్లినా

భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ లు మాత్రం రష్యాలో పర్యటించారు. అయితే, రష్యాకు పూర్తి మద్దతుదారైన జింగ్ పిన్ ఉక్రెయిన్ లో మాత్రం కాలుపెట్టలేదు. మోదీ అలా కాదు.. మొదట రష్యాలో, ఆ తర్వాత ఉక్రెయిన్ లో పర్యటించారు. ఆయా దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్ స్కీలను భారత్ లో పర్యటించాలని ఆహ్వానించారు. పుతిన్ కు అయితే భారత్ కు రమ్మంటూ ఆహ్వాన లేఖ కూడా రాశారు.

ఉక్రెయిన్ పై ఏం చెబుతారో?

ఉక్రెయిన్ విషయంలో తమది శాంతి పక్షమని.. రష్యా, ఉక్రెయిన్ పక్షం కాదని మోదీ పునరుద్ఘాటిస్తున్నారు. అవసరమైతే రెండు దేశాల మధ్య చర్చలకు చొరవ చూపుతామని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే పుతిన్ తో రష్యాలోని కజన్‌ లో 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భేటీ అయ్యారు మోదీ. ద్వైపాక్షిక చర్చల తర్వాత భారత్‌ లో పర్యటించాలని ఆహ్వానించారు. జూలైలోనూ మోదీ రష్యా వెళ్లారు. పుతిన్ ను ఆలింగనం చేసుకున్నారు. దీనిపై జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఉక్రెయిన్ వెళ్లినప్పుడు ఆయననూ ఆలింగనం చేసుకున్నారు.

పుతిన్ కు పిలుపందింది..

తమ అధ్యక్షుడిని భారత్ లో పర్యటించాల్సిందిగా మోదీ పంపిన ఆహ్వానం తమకు అందిందని రష్యా రాయబార కార్యాలయం పేర్కొంది. 2025 ప్రారంభంలో తేదీలు ఖరారు చేస్తామని రష్యా అధ్యక్ష భవనం తెలిపింది. ఏటా ఒకసారి సమావేశం కావాలని పుతిన్-మోదీ ఇప్పటికే అంగీకరించారు. అందుకే ఈసారి పుతిన్‌ భారత్‌ వస్తున్నట్లు రష్యా చెప్పింది.

గణతంత్ర వేడుకకేనా?

పుతిన్ గతంలో భారత గణతంత్ర వేడుక (జనవరి 26)కు ఓసారి హాజరయ్యారు. ఏనుగు మీద ఊరేగించడంతో బాగా సంతోషించారు. రష్యాలో ఏనుగులు ఉండవు కాబట్టి.. పుతిన్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధంపై మరింత ఆందోళన, అంతర్జాతీయ అస్థిరత నెలకొనగా పుతిన్ భారత్ కు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.