'సమన్వయం' ఏది చిన్నమ్మా?!
పురందేశ్వరి, మోడీ సహా కేంద్ర నేతల ఫొటోలను పెద్దవిగా ముద్రించారు. దీంతో టీడీపీ నాయకులు జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.
By: Tupaki Desk | 10 April 2024 7:14 AM GMTమూడు పార్టీలు ముచ్చటగా చేతులు కలిపాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అంతం చేయాలని బీజేపీ-జనసేన-టీడీపీలు కంకణం కట్టుకున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం చేతులు కలవలేదు. మాటలు కలుసుకోవడం లేదు. దీంతో ఇతర పార్టీలకంటే కూడా.. బీజేపీకి ఎక్కువగా ఇబ్బంది ఎదురవుతోంది. కేవలం ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప.. మిగిలిన నియోజకవర్గాల్లో పంతాలు.. పట్టిం పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రధానంగా ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయకులను పార్టీ పక్కన పెట్టడం ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ కీలక నాయకుడు సోము వీర్రాజు ప్రభావం ఎక్కువగా ఉంది. కాపులకు.. ఆయన మిత్రుడనే పేరు తెచ్చుకున్నారు. వారికి ఏం చేశారు? చేయలేదు.? అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వలేదన్న ఆవేదన అయితే తూర్పులో వినిపిస్తోంది. ఇదే ఆవేదన ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ పై పడింది.
తాజాగా ఆమె రాజమండ్రిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కీలక బీజేపీ నేతలు ఎవరూ రాలేదు. వచ్చిన వారిలోనూ ఇద్దరు ముగ్గురు తప్ప.. మిగిలిన వారు కనిపించి హాజరు వేయించుకుని వెళ్లిపోయారు. ఇక, టీడీపీ నాయకులు.. హాజరైనా ముక్తసరిగా ఉండిపోయారు. మరోవైపు.. సమన్వయ లోపం కారణమో.. ఉద్దేశ పూర్వకంగా చేశారో.. తెలియదు కానీ, పురందేశ్వరి సమావేశానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో టీడీపీ ఎన్నికల గుర్తును వేయడం వదిలేశారు. ఇక, చంద్రబాబు ఫొటోను కూడా చిన్నదిగా ముద్రించారు.
పురందేశ్వరి, మోడీ సహా కేంద్ర నేతల ఫొటోలను పెద్దవిగా ముద్రించారు. దీంతో టీడీపీ నాయకులు జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. మూడు పార్టీలు కలిసి పనిచేయాలని అనుకుంటే.. చంద్ర బాబుకు తగిన గౌరవం ఇవ్వాలని నాయకులు డిమాండ్లు చేశారు. అంతేకాదు పురందేశ్వరి సమక్షంలో బీజేపీ ఫ్లెక్సీని కూడా చింపేశారు. మొత్తంగా ఆత్మీయ సమావేశం కాస్తా రసాభాసగా మారింది. మరి ఎన్నికలకు 30 రోజుల ముందే ఇలాంటి పరిస్తితి ఉంటే.. ఎన్నికల రోజు మాటేంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.