ఇంట్రస్టింగ్ పోస్ట్స్... 'పుష్ప'ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ "పుష్ప-2" సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుందని అంటున్నారు.
By: Tupaki Desk | 10 Dec 2024 3:36 AM GMTఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ "పుష్ప-2" సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుందని అంటున్నారు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ.. అన్ని భాషల్లోనూ హల్ చల్ చేస్తోందని చెబుతున్నారు. ఈ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ 'పుష్ప-2' పోస్టర్స్ ని అటు ఆప్, ఇటు బీజేపీ ఫుల్ గా వాడేస్తున్నారు.
అవును.. "పుష్ప-2" సినిమా ఏపీ రాజకీయాల్లో సరికొత్త సందడి తీసుకొచ్చిందని చెబుతున్న వేళ.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఢిల్లీలోనూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగా.. ఆ సినిమా స్టిల్స్ తో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ మొదలైంది.
దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల సందడికి సిద్ధమవుతున్న వేళ రెండు రాజకీయ పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప-2’ సినిమాలోని ఫేమస్ డైలాగ్స్ (తగ్గేదేలే, రప్పా రప్పా) ని ఫుల్ గా వాడేస్తున్నాయి.
ఇందులో భాగంగా... ‘పుష్ప-2’ లోని హీరో ఫోజులో ఉన్న కేజ్రీవాల్... భుజంపై చీపురు పెట్టుకుని ఉన్నారు. నాలుగోసారి అధికారం తమదే అనే అర్ధంలో ఆ పోస్టర్ ను రూపొందించారు. ఈ సందర్భంగా... “కేజ్రీవాల్ ఝుకేగా నహీ (తగ్గేదేలే)” అంటూ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
మరోపక్క ఆమ్ ఆద్మీకి ధీటుగా అన్నట్లుగా భారతీయ జనతాపార్టీ కూడా ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో భాగంగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ ను పుష్ప క్యారెక్టర్ తరహాలోనే కుర్చీలో కూర్చున్నట్లూ రూపొందించి.. "అవినీతిపరులను అంతం చేస్తామంటూ.. రప్పా - రప్పా" అని రాసి ఉన్న పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో... ఢిల్లీ రాజకీయంలో ‘పుష్ప-2’ మేనియా ఆసక్తిగా మారింది.
కాగా.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ఇదే క్రమంలో ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఎన్నాళ్ల నుంచో అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ పీఠాన్ని ఈసారైనా దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.