పుష్ప 2 నిర్మాతల్ని అరెస్టు చేయొద్దు.. హైకోర్టు రిలీఫ్
దీనికి సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగి.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పిటిషన్ పై నిర్మాతల తరఫు న్యాయవాది నవీన్ కుమార్ వాదనలు వినిపించారు.
By: Tupaki Desk | 2 Jan 2025 4:38 AM GMTపుష్ప 2 విడుదలకు ముందు రోజు రాత్రి నిర్వహించిన ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ున్న సంథ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట.. ఈ వ్యవహారంలో ఇప్పటికే జరిగిన అరెస్టుల వ్యవహారం ఎంతటి సంచలానికి తెర తీశాయో తెలిసిందే. ఈ వ్యవహారంలో పుష్ప 2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్.. యేర్నేని నవీన్ లకు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో తమను అరెస్టు చేయొద్దంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు.
దీనికి సంబంధించిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగి.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పిటిషన్ పై నిర్మాతల తరఫు న్యాయవాది నవీన్ కుమార్ వాదనలు వినిపించారు.
తొక్కిసలాట ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అభియోగాలు ఏవీ నిర్మాతలకు వర్తించవని తెలిపారు. చిత్ర హీరోొ అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వస్తున్నట్లు.. నిర్మాతల కార్యాలయ సిబ్బంది.. థియేటర్ నిర్వాహకులకు.. పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు.
తొక్కిసలాట జరిగిన రోజున సీనియర్ అధికారులైన ఏసీపీ.. డీసీపీలు థియేటర్ వద్దకు వచ్చి భద్రత పరిశీలించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లకు అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో అరెస్టు అయిన థియేటర్ మేనేజర్ తో పాటు అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది రమేశ్.. శ్రీరాములు.. రాజులకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి ఈ పిటిషన్ల విచారణను ఈ నెల ఆరుకు వాయిదా వేశారు.