"పుష్ప 2.0" రౌండప్: 6 గంటలు - 2 కోర్టులు - 14 రోజులు - బెయిల్!
ఒక్కసారిగా షాక్ తిని కాసేపటికి తేరుకున్న సందర్భం.. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు యావత్ భారతదేశంలోని సినీ అభిమానులు ఒక్కసారిగా షాకింగ్ గా ఫీలయిన వ్యవహారం
By: Tupaki Desk | 13 Dec 2024 1:44 PM GMTసంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ అరెస్టు నుంచి మొదలై, రిమాండ్ కు తరలించబడి, మధ్యంతర బెయిల్ పొందడం వరకూ జరిగిన పరిణామాలు లైవ్ లో చూడకుండా ఒక్కసారిగా చెబితే నమ్మశక్యంగా ఉండదని చెప్పినా అతిశయోక్తి కాదేమో. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దామ్..!
అవును... దాదాపు ఏ ఒక్కరూ ఊహించని విషయం.. ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా షాక్ తిని కాసేపటికి తేరుకున్న సందర్భం.. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు యావత్ భారతదేశంలోని సినీ అభిమానులు ఒక్కసారిగా షాకింగ్ గా ఫీలయిన వ్యవహారం.. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ - రిమాండ్ - బెయిల్ ఎపిసోడ్!
మధ్యాహ్నం 12 గంటలకు... అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయబోతున్నట్లు ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు తెలిపారు. దీంతో... ఒక్కసారిగా న్యూస్ ఛానల్స్ లో బ్రేకింగ్స్ హల్ చల్ చేశాయి. ఈ సందర్భంగా... కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నేరుగా బెడ్ రూమ్ వద్దకు వచ్చి అరెస్ట్ చేశారంటూ బన్నీ అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం.. మరో 10 నిమిషాల తర్వాత అల్లు అర్జున్ ని వాహనంలో ఎక్కించుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. బన్నీ కోసం పోలీసులు వచ్చిన సమయంలో ఆయన సతీమణి స్నేహరెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ఆమెను సముదాయించారు!
మధ్యాహ్నం 1 గంటకు... అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే... మధ్యాహ్నం 1:30 గంటలకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారని తెలుస్తోంది. ఈ సమయంలో... సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ ని విచారించడం.. ఆయన నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగిపోయింది.
మధ్యాహ్నం 2 గంటలకు... చిక్కడపల్లి స్టేషన్ నుంచి బయలుదేరి గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ ను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హాస్పటల్ సూపరిండెంటెంట్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్, బీపీ, షుగర్, ఈసీజీ మొదలైన పరీక్షలు నిర్వహించారని అంటున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు... గాంధీ ఆస్పత్రి నుంచి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ని తరలించారు పోలీసులు. అనంతరం నాంపల్లి కోర్టులోని 9వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
మధ్యాహ్నం 4 గంటలకు.. మరోపక్క.. హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోటాపోటీగా వాదోపవాదాలు జరిగాయని అంటున్నారు.
మరోపక్క.. అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు, నాగబాబు చేరుకున్నారు. ఇంకోపక్క అల్లు అరవింద్ తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. మీడియా మొత్తం నాంపల్లి కోర్టు పరిశరాల వద్దే ఉంది! మరోపక్క.. రాజకీయ నాయకుల స్టేట్ మెంట్స్ మొదలయ్యాయి.
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ బీఆరెస్స్ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారని అంటున్నారు. మరోపక్క ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు లు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. మరోపక్క బీజేపీ నేతలు బండి సంజయ్, రాజాసింగ్ లు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు!
అటు వైసీపీ నేత అంబటి రాంబాబు.. 'అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం!' అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నరంటూ లక్ష్మీ పార్వతి ఫైరయ్యారు. పుష్కరాల్లో 29 మంది మరణానికి కారణమైనప్పుడు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కేఏ పాల్ ప్రశ్నించారు.
అదే సమయంలో... విషయం వేరైనప్పటికీ సందర్భానికి తగ్గట్లుగా అని అనిపించేలా "విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం.." అంటూ పొందుపరిచిన వాక్యాన్ని "కలిసుంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం.." అనే సబ్జెక్ట్ తో కలిపి పవన్ కల్యాణ్ ట్వీట్ ప్రత్యక్షమైంది! దీంతో.. ఆన్ లైన్ వేదికగా నెటిజన్ల విశ్లేషణలు పీక్స్ కి చేరాయి.
ఈ సమయంలో... సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో భార్యను కోల్పోయిన భాస్కర్ స్పందించారు. ఆయన ఫిర్యాదు మేరకే అరెస్టులు జరుగుతున్నాయని అంటున్న వేళ... “అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం లేదు.. ఆస్పత్రిలో ఉన్న నేను అరెస్ట్ వార్త చూశాను.. కేసు విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను” అని స్పందించారు.
కట్ చేస్తే... సాయంత్రం 4:15 గంటలకు టీవీల్లో బిగ్ బ్రేకింగ్ విత్ లౌడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... "అల్లు అర్జున్ కి రిమాండ్... అల్లు అర్జున్ కి రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్" అని వరుసగా బ్రేకింగ్ లు కనిపించాయి. దీంతో... అభిమానుల గుండెలు ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయని అంటున్నారు.
బిగ్ ట్విస్ట్... సాయంత్రం 4:40 గంటల సమయంలో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది! రూ.50,000 వ్యక్తిగత పూచీ కత్తుపై బెయిల్ మంజూరూ చేసింది! అయితే.. అప్పటికే అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించే పనిలో ఉన్నారు.. ఫైనల్ గా తరలించారు!
సాయంత్రం 5:16 గంటలకు... వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది అని చెప్పిన జగన్... అదే సమయంలో... దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
అయితే... ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకూ సమంజసం? అని జగన్ ప్రశ్నించారు. ఇదే సమయంలో... తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం సమ్మతం కాదని.. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
సాయంత్రం 6 గంటలకు... హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ కాపీ చంచల్ గూడ జైలు సూపరిండెంట్ కు చేరిన అనంతరం ప్రొసీజర్ పూర్తైన తర్వాత అల్లు అర్జున్ ని జైలు నుంచి విడుదల చేస్తారు! మరోపక్క అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారని తెలుస్తోంది.