Begin typing your search above and press return to search.

పండుగ నాడూ బాంబుల మోత..ఎర్ర సముద్రంలో రక్తం పారించిన రష్యా

తరచూ దాడులు చేస్తూనే ఉంది పుతిన్ సైన్యం. కాగా, క్రిస్మస్ పండుగ నాడు మళ్లీ ఖార్కివ్‌ ను టార్గెట్ చేసింది. ఈ నగరంపై క్షిపణులతో భారీగా దాడులకు దిగింది.

By:  Tupaki Desk   |   25 Dec 2024 12:05 PM GMT
పండుగ నాడూ బాంబుల మోత..ఎర్ర సముద్రంలో రక్తం పారించిన రష్యా
X

మూడేళ్లు గడుస్తున్నా.. సంవత్సరం మారుతున్నా.. వేల మంది సైనికులు ప్రాణాలు పోతున్నాయి.. రూ.లక్షల కోట్ల ఆస్తి నష్టం జరుగుతోంది.. ఆయుధాలు ఖర్చయిపోతున్నాయి.. కానీ, ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మాత్రం ముగింపు కనిపించడం లేదు. ఆఖరికి ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకొనే క్రిస్మస్ పండుగ నాడూ బాంబుల మోత మోగించింది రష్యా.

రెండో అతిపెద్ద నగరం ధ్వంసం ఖార్కివ్.. ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరం. కానీ, మూడేళ్ల నుంచి యుద్ధంలో రష్యా ధాటికి దెబ్బతిన్నది ఈ నగరమే. తరచూ దాడులు చేస్తూనే ఉంది పుతిన్ సైన్యం. కాగా, క్రిస్మస్ పండుగ నాడు మళ్లీ ఖార్కివ్‌ ను టార్గెట్ చేసింది. ఈ నగరంపై క్షిపణులతో భారీగా దాడులకు దిగింది.

పేలుళ్ల మోతతో..

ఖార్కివ్‌ లో ప్రస్తుతం పేలుళ్ల మోత తప్ప క్రిస్మస్ ప్రార్థనలు వినిపించడం లేదు. అంతగా భారీఎత్తున క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ నగరంపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురుస్తోందని చెప్పొచ్చు. అయితే, ఉక్రెయిన్ నుంచి వచ్చిన 59 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణశాఖ తెలిపింది.

తూర్పు భాగం రష్యా చేతుల్లో ఉక్రెయిన్ తూర్పు భాగం డాన్ బాస్ (లుహాన్స్క్-డొనెట్స్క్). దాదాపు ఉక్రెయిన్ లో నాలుగో40 శాతం ఉంటుంది. దీనిని రష్యా ఆక్రమించేసి రెండేళ్ల కిందటే ప్రజాభిప్రాయ సేకరణతో కలిపేసుకున్నంత పనిచేసింది. ఇక కొన్ని నెలలుగా తూర్పు ఉక్రెయిన్‌ లోకి మరింత లోతుగా వెళ్తున్నాయి రష్యా దళాలు.

ట్రంప్ వచ్చేలోగా..

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేసరికి ఉక్రెయిన్ లో సాధ్యమైనంత భూభాగాన్ని గుప్పిట పట్టాలనేది రష్యా ఉద్దేశంగా తెలుస్తోంది. తద్వారా ఉక్రెయిన్ విషయంలో తమ మాట నెగ్గించుకునే వీలుంటుందని భావిస్తోంది. ఈ ఏడాది ఉక్రెయిన్‌ లోని 190 ప్రాంతాలను ఆక్రమించినట్లు స్వయంగా ప్రకటించింది కూడా. మానవ వనరులు, ఆయుధాల కొరతతో ఉక్రెయిన్ ఇటీవల దీటుగా పోరాడలేకపోతోంది.

ఓవైపు యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెబుతున్నారు. కానీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తే లేదంటున్నారు. ట్రంప్ మాత్రం తాను ముగింపు పలుకుతానని అంటున్నారు. మరి.. ఆయన ప్రణాళికలు ఏమిటో తెలియాల్సి ఉంది.