కీలక పరిణామం : భారత్ కు పుతిన్.. ఏం జరుగుతోంది?
రెండు దశాబ్దాలకు పైగా రష్యాను ఏలుతున్న ఈ శక్తివంతమైన నాయకుడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
By: Tupaki Desk | 27 March 2025 11:06 AMవ్లాదిమిర్ పుతిన్.. ఈ పేరు వింటేనే ప్రపంచ రాజకీయాల్లో ఒక ప్రకంపనలు మొదలవుతాయి. రెండు దశాబ్దాలకు పైగా రష్యాను ఏలుతున్న ఈ శక్తివంతమైన నాయకుడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే, పుతిన్ నిజంగా దేని కోసం పనిచేస్తున్నారు? ఆయన అంతిమ లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని వెంటాడుతున్నాయి.
పుతిన్ లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి, మనం రష్యా యొక్క చరిత్ర సంస్కృతిని పరిశీలించాలి. సోవియట్ యూనియన్ పతనం తరువాత రష్యా ఎదుర్కొన్న ఆర్థిక సామాజిక సంక్షోభం పుతిన్ యొక్క ఆలోచనలపై బలమైన ముద్ర వేసింది. రష్యా యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని, ప్రపంచ వేదికపై ఒక బలమైన శక్తిగా నిలబెట్టాలని ఆయన బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగుతున్నవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఇదే హాట్ టాపిక్ గా మారింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు.
"రష్యా అండ్ ఇండియా: టువర్డ్ ఏ బైలాటరల్ అజెండా" అనే అంశంపై రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ (RIAC) నిర్వహించిన సమావేశంలో లావ్రోవ్ మాట్లాడుతూ, ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, పర్యటన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తన తొలి అంతర్జాతీయ పర్యటనను రష్యాలోనే జరిపారని లావ్రోవ్ గుర్తు చేశారు. ఇప్పుడు పుతిన్ భారత్‌లో పర్యటించనుండటం తమ వంతు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ గత ఏడాది జూలైలో రష్యాలో పర్యటించారు. ఐదేళ్ల తర్వాత ఆయన అక్కడ పర్యటించడం అదే మొదటిసారి. అంతకు ముందు 2019లో రష్యాలోని వ్లాదివోస్టోక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇటీవల రష్యా పర్యటన సందర్భంగా పుతిన్‌ను భారత్‌కు రావాల్సిందిగా మోదీ ఆహ్వానించారు.
అమెరికా నుంచి వస్తున్న టారిఫ్‌ల ముప్పు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో పుతిన్ భారత్‌లో పర్యటించనుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.