పుతిన్ కొత్త నిర్ణయం: మా ఆస్తులు బ్లాక్ అంటే మీ పెట్టుబడులూ బ్లాక్!
అవును... ఇప్పటికే బాడీ డబుల్స్ ఆరోపణలు పుతిన్ పై బలంగా వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Nov 2023 3:30 PM GMTతాను ఆలోచించడం మొదలుపెడితే తనకంటే రొటీన్ కి భిన్నంగా ఎవరూ ఆలోచించరు అని అనుకుంటారో ఏమో కానీ... రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో కీలక ఆలోచన చేశారు. ఫలితంగా తాను ఫైనలైజ్ చేసిన ఒక సరికొత్త అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యన్స్ ఆస్తులు ఏయే దేశాల్లో బ్లాక్ అయ్యాయో.. ఆయా దేశాలకు తనదైన షాక్ ఇచ్చారు పుతిన్.
అవును... ఇప్పటికే బాడీ డబుల్స్ ఆరోపణలు పుతిన్ పై బలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి రష్యా అధికారికంగా వైదొలిగింది. వాస్తవానికి ఇంతకు ముందు ఈ తీర్మానానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం... ప్రపంచంలో ఎక్కడా కూడా అణ్వస్త్ర పరీక్ష జరగకూడదు.
ఇలాంటి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న రష్యా అధ్యక్షుడు... అమెరికా దాని మిత్ర దేశాలకు గట్టి షాకిచ్చేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి.. ఉక్రెయిన్ తో యుద్ధంపై రష్యాను తప్పుపడుతూ ఆయా దేశాలు పలు ఆంక్షలు విధిస్తూ అందులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని రష్యన్ల ఆస్తులను స్తంభింపచేశాయి. ఇప్పుడు ఆ దేశాలకు పుతిన్ షాకిచ్చాడు.
అందులో భాగంగా... రష్యన్ల ఆస్తులను స్తంభింపచేసిన వెస్ట్రన్ దేశాలకు కౌంటర్ గా ఆయా దేశాలకు చెందిన ఇన్వెస్టర్ల సంపదను మాస్కో బ్లాక్ చేసింది. ఈ మేరకు తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ డిక్రీపై సంతకం చేశారు. దీని ప్రకారం... రష్యాలో స్తంభింపజేసిన నిధులతో విదేశీ ఇన్వెస్టర్లు ఆయా దేశాల్లో ఉన్న రష్యన్ల ఆస్తులను కొనుగోలు చేయొచ్చు. ఇది తాజాగా వెస్ట్రన్ కంట్రీస్ కి, అమెరికా మిత్రదేశాలకూ పుతిన్ ఇచ్చిన షాక్!
యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన పలు ఆంక్షల ఫలితంగా సుమారు 3.5 మిలియన్లకు పైగా రష్యన్ల సంపద విదేశాల్లో బ్లాక్ అయిందని చెబుతున్నారు. ఈ విషయంలో రష్యన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సంపద బ్లాక్ పై పుతిన్ నుంచి పరిష్కారం ఆశిస్తున్నారు. వీటి విలువ దాదాపు 1.5 ట్రిలియన్ రూబిల్స్ (16.3 బిలియన్ డాలర్లు)గా ఉండవచ్చని అంచనా.
ఇంతభారీ మొత్తం బ్లాక్ అయిపోవడం చిన్న విషయం కాదు. దీంతో వీటి విడుదలకు పుతిన్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమ దేశంలో ఉన్న ఇతర దేశాల మదుపర్ల సంపదను బ్లాక్ చేస్తూ నివేధిక విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు విడుదలయ్యాయని సమాచారం! దీంతో ఏయే దేశాల్లో రష్యన్ల ఆస్తులు స్తంభించాయో.. వాటిని రష్యాలో పెట్టుబడులుపెట్టినవారు ఆ డబ్బుతో వీటిని కొనుగోలు చేయవచ్చు! ఇది పుతిన్ తాజా డెసిషన్!