Begin typing your search above and press return to search.

ఈసారి వ్లాదిమిర్‌ వంతు... పుతిన్ ని వ్యతిరేకిస్తే పరలోకమేనా?

అవును... పుతిన్ తో పెట్టుకుంటే పైలోకాలకే అనే చర్చ ఇప్పుడు రష్యాలో మొదలైందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:00 AM GMT
ఈసారి వ్లాదిమిర్‌  వంతు... పుతిన్  ని వ్యతిరేకిస్తే పరలోకమేనా?
X

ప్రస్తుతం రష్యాలో ఈ తరహా చర్చ ఒకటి మొదలైంది. వ్లాదిమీర్ పుతిన్ చేసిన, చేస్తున్న పనుల్లో.. తీసుకుంటున్న, తీసుకున్న నిర్ణయాల్లో ఎవరైనా లోపాలు ఎత్తిచూపితే.. వారు పైలోకాలకు పోవాల్సిందేనా అనే చర్చ బలంగా సాగుతుందని తెలుస్తుంది. కారణం... ఇటీవల విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించడం, ఆ సమయంలో పుతిన్ కి సంబంధించినది చెప్పిన "నమ్మక ద్రోహం" వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ అధికారి ఒకరు అనుమానాస్పదంగా మృతిచెందారు!

అవును... పుతిన్ తో పెట్టుకుంటే పైలోకాలకే అనే చర్చ ఇప్పుడు రష్యాలో మొదలైందని అంటున్నారు. దీనికి కారణం పుతిన్‌ పై విమర్శలు చేసినా, తిరుగుబాటు చేసిన వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందడమే. ఈ క్రమంలో తాజాగా ఎయిర్‌ కమాండర్‌ ఒకరు కూడా అదే రీతిలో చనిపోయారు. ఆయన నివాసంలో మృతదేహమై కనిపించారు. పుతిన్ పై విమర్శలు చేసిన అనంతరం ఇది జరగిందని అంటున్నారు!

గతంలో రష్యా వాయుసేనలో పనిచేసిన వ్లాదిమిర్‌ స్విరిదోవ్‌ అనే అధికారి.. స్టావ్రోపోల్‌ లోని ఆయన నివాసంలో విగతజీవిగా కనిపించారు. ఆయన పక్కనే భార్య మృతదేహం కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారని అంటున్నారు. అయితే... వీరిద్దరి మరణాలకు గల కారణాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు! ఇంకా తెలియరాలేదు అని చెబుతున్నారు! అయితే... స్థానికంగా సోషల్ మీడియా వేదికగా మాత్రం వీరి హత్యకు గల కారణాలపై చర్చ మొదలైందని తెలుస్తుంది!

2005-2009 మధ్యకాలంలో ఎయిర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ లో కమాండర్‌ గా పనిచేసిన వ్లాదిమిర్ స్విరిదోవ్‌.. ఎయిర్‌ ఫోర్స్‌ లో ప్రమాణాల విషయంలో పుతిన్‌ పై గతంలో విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఇటీవల మరోసారి సైన్యంలో పైలట్లకు తగిన శిక్షణ అందడం లేదని, వారికి ఇచ్చే వేతనాలు, అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు.

ఇందులో భాగంగా... యుద్ధానికి సిద్ధంగా ఉండే ఒక పైలట్‌ ఏడాదికి 100 గంటలు పాటు విమానాన్ని నడిపి ఉండాలని.. కానీ, ప్రస్తుతం అలా ఉండటం లేదని.. ప్రస్తుత 25-30 గంటలు మాత్రమే పైలట్ విమానం నడుపుతున్నారని వ్లాదిమిర్‌ స్విరిదోవ్‌ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. దీని కారణంగానే థర్డ్‌ ర్యాంకింగ్‌ పైలట్లను మిలటరీ అకాడమీలకు పంపించాల్సి వస్తుంది.. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని విమర్శించారు.

కాగా... ఈ ఏడాది ఆగస్టు లో రష్యా వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్ ప్రిగోజిన్‌.. విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో... ప్రిగోజిన్‌ ది ప్రమాదం కాదని, అతడిని హత్య చేశారని అమెరికా ఇంటెలిజెన్స్‌ అంచనా వేసింది. దీంతో నాడు రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన సరిగ్గా అరవై రోజులకు ఎవరూ ఊహించని విధంగా ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైంది.

జూన్‌ 23వ తేదీన రష్యా సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్‌ తిరుగుబాటు ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దానిని ఉపసంహరించుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో రాజీపడ్డారు. ఈ ఘటనకు సరిగ్గా రెండు నెలలు పూర్తయిన (ఆగస్టు 23న) సమయంలో ప్రిగోజిన్‌ విమానం కూలి మరణించారు. దీంతో పుతిన్ ని వ్యతిరేకిస్తే పరలోకమేనా అనే చర్చ బలంగా మొదలైంది!

ఇక ప్రిగోజిన్ కంటే ముందు ఉక్రెయిన్‌ లో రష్యా సైనిక చర్యను విమర్శించిన రష్యా అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ కంపెనీ బోర్డు ఛైర్మన్ ఆసుపత్రి కిటికీలోంచి పడిపోయి మరణించాడు. ఇదే సమయంలో... రష్యా శాసనసభ్యుడు పావెల్ ఆంటోవ్ ఓ హోటల్‌ పై నుంచి పడి మరణించాడు. అదేవిధంగా... గతేడాది ఉక్రెయిన్‌ తో యుద్ధం మొదలైనప్పటినుంచీ రష్యాకు చెందిన సుమారు 19 మంది పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి!