ఖమ్మంలో బందిపోటు దొంగలు.. గతం తవ్వుతున్న పువ్వాడ!
ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతంగా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ముస్తఫా నగర్ లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 16 Oct 2023 2:11 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మరోసారి ఆత్మీయ సమ్మేళనాల సీజన్ స్టార్టయ్యింది. నాయకులంతా తమ తమ పార్టీ కార్యకర్తలతోనూ, అభిమానులతోనూ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతంగా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ముస్తఫా నగర్ లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో బీఆరెస్స్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో... రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన.. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా... మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై ఫైరయ్యారు.
ఇందులో భాగంగా... తాను బీ-ఫారం తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్తే.. ఖమ్మంలో కొందరు బందిపోటు దొంగలు చొరబడ్డారని మొదలుపెట్టిన అజయ్... దమ్ముంటే తాను ఖమ్మంలో ఉన్నప్పుడు వస్తే.. వారికి సినిమా చూపించేవాణ్నని మండిపడ్డారు. ఇదే సమయంలో... ఓ అవకాశవాది ఐదేళ్లకో పార్టీ మారస్తున్నారని.. ఇప్పటివరకూ ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లను ఆయన మోసం చేశారని మండిపడ్డారు.
అలాంటి వ్యక్తి రేపు కాంగ్రెస్ పార్టీని మాత్రం మోసం చేయరనే గ్యారేంటీ ఏమిటి అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తికి ఒకప్పుడు కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారని.. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న వ్యక్తిని పిలిచి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేసి అనంతరం జిల్లా బాధ్యతలు అప్పగించి గెలిపించమంటే 2018 ఎన్నికల్లో ఖమ్మంలో గుండు సున్నా చుట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇదే సమయంలో పార్టీకి, కేసీఆర్ కు తుమ్మల చేసిందేమీ లేకపోయినప్పటికీ... ఆయనకు మాత్రం కేసీఆర్ ఎంతో చేసారని అజయ్ చెప్పుకొచ్చారు. అయినా తమకు అన్యాయం జరిగిందని, టిక్కెట్ రాలేదని కేసీఆర్ ను తూలనాడుతూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. 2018 ఎన్నికల్లో వారిద్దరూ ఒకరిపై మరొకరు కత్తి దూసుకొని తొమ్మిది స్థానాల్లోనూ ఓడగొట్టారని, తాను మాత్రమే వారిద్దరి కత్తిని తప్పించుకొని గెలిచానని అజయ్ తెలిపారు.
కాగా... రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014 ఎన్నికల సమయంలో ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.