మన పీవీ.. భారత రత్న ఠీవీ, చరణ్ సింగ్ కూ..
సహజంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే భారత రత్నను ఈసారి కర్పూరీ ఠాకూర్ కు ఇచ్చినా.. కాస్త భిన్నంగా వారం రోజుల తర్వాత బీజేపీ సీనియర్ నేత ఆడ్వాణీకి ఇచ్చింది.
By: Tupaki Desk | 9 Feb 2024 7:59 AM GMTకేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో అసాధారణ నిర్ణయం తీసుకుంది. సహజంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే భారత రత్నను ఈసారి కర్పూరీ ఠాకూర్ కు ఇచ్చినా.. కాస్త భిన్నంగా వారం రోజుల తర్వాత బీజేపీ సీనియర్ నేత ఆడ్వాణీకి ఇచ్చింది. అది జరిగి వారం అయిందో లేదో మాజీ ప్రధానులు, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ లకు ప్రకటించింది. చరణ్ సింగ్ విషయం పక్కనపెడితే.. దేశం ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో గట్టెక్కించిన మేధావి.. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేయాలని భావించే పనిమంతుడు, మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లూ నడిపిన చాణక్యుడు.. అన్నిటికి మంచి తెలంగాణ బిడ్డ మహా పండితుడు పాములపర్తి వెంకట నరసింహారావుకు భారత రత్న దక్కడం తెలుగువారందరికీ గౌరవప్రదం.
వంగరలోపుట్టి దేశ ప్రధాని స్థాయికి ఎదిగి..
తెలంగాణలోని వంగర గ్రామంలో జన్మించిన పీవీ.. దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎం ఉన్నప్పుడు భూ సంస్కరణలను అమలు చేసిన ఆయన.. ప్రధాని అయ్యాక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఓ విధంగా ఆయన సీఎం పదవి పోవడానికి ఉమ్మడి రాష్ట్రంలోని భూస్వాములే కారణం అనే ఆరోపణ ఉంది. అయినా వెనుకంజ వేయని ధీరత్వం పీవీది. అదే నిబ్బరంతో ప్రధాని స్థాయికి ఎదిగారు. అక్కడ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి భారత దేశాన్ని ప్రపంచంలోనే బలీయమైన దేశంగా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు.
ఆ సంస్కరణల ఫలమే నేడు..
పీవీ ప్రధాని అయ్యేనాటికి దేశంలో రాజకీయంగా అస్థిరత నెలకొంది. రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కనీస సంఖ్యలో సీట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాక.. మూడో పక్ష రాజకీయాలు మొదలయ్యాయి. దేశంలో ఆర్థిక నిల్వలు నిండుకున్నాయి. బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి. అలాంటి సమయంలో మన్మోహన్ సింగ్ తో కలిసి ఆర్థిక సంస్కరణలు తెచ్చారు పీవీ. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా వెనుకంజ వేయలేదు. ఆ నిర్ణయం ఫలితమే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వివిధ సౌకర్యాలు. కాగా, పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, ప్రఖ్యాత వ్యవస్థాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కూ భారత రత్న ప్రకటించారు. మరోవైపు వీరితో కలిపి ఈ ఏడాది నలుగురికి ఏకంగా భారత రత్న ప్రకటించడం విశేషం. ఇప్పటివరకు గరిష్ఠంగా ఒక ఏడాదికి ఇద్దరికే భారత రత్న దక్కినట్లు సమాచారం.
పాములపర్తి వెంకట నరసింహారావుగా సుప్రసిద్ధులైన పీవీ నరసింహారావు 1921 జూన్ 28న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. 2004 డిసెంబరు 23న చనిపోయారు. మరోవైపు 1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. ఈయన కుమార్తె సురభి వాణిదేవి ప్రస్తుతం హైదరాబాద్ గ్రాడ్యుయేల్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కుమారులు.. పీవీ రంగారావు, పీవీ రాజేశ్వరావు, పీవీ ప్రభాకరరావు.
కాగా, పీవీ 1957లో మంథని నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వరుసగా నాలుగు సార్లు అక్కడినుంచే గెలిచారు. 1962 లో తొలిసారి మంత్రి అయ్యారు. 1964 వరకు న్యాయ, సమాచార శాఖ, 1964-67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ, 1968-71 మధ్యన న్యాయ, సమాచార శాఖ బాధ్యతలు చూశారు. 30 సెప్టెంబరు1971 నుంచి 10 జనవరి 1973 మధ్యన ఉమ్మడి ఏపీకి నాలుగో సీఎంగా పనిచేశారు. 21 జూన్ 1991 – 16 మే1996 మధ్యన ప్రధానిగా వ్యహరించారు. దీనికిముందు రాజీవ్, ఇందిరా గాంధీల ప్రభుత్వాల్లో కేంద్ర హోం, విదేశాంగ శాఖ మంత్రులుగా పనిచేశారు.
భారత రత్న ప్రకటించిన మిగతా ఇద్దరిలో చరణ్ సింగ్ రైతు నాయకుడు. అన్నదాతల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేశారు. భారత ప్రధానిగా పనిచేశారు. ఇక స్వామినాథన్ వ్యవసాయ విప్లవ పితామహుడు. నిరుడు ఈయన కన్నుమూశారు.