పీవీ.. పత్రికల్లో అచ్చుకాని కొన్ని పచ్చి నిజాలు
ఇప్పుడు మేం చెప్పే అంశాల్లో చాలావరకు ఇప్పటివరకు మరే దినపత్రికలోనూ అచ్చుకాని అంశాలే
By: Tupaki Desk | 11 Feb 2024 8:08 AM GMTఇప్పుడు మేం చెప్పే అంశాల్లో చాలావరకు ఇప్పటివరకు మరే దినపత్రికలోనూ అచ్చుకాని అంశాలే. ఎందుకుంటే.. ఒక సీనియర్ జర్నలిస్టు తన నలభై ఏళ్ల సర్వీసులో తెలుగోడు.. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గురించి దగ్గరగా చూసిన అంశాల్ని ప్రస్తావిస్తూ ఫేస్ బుక్ లో ఒక భారీ పోస్టు పెట్టారు. అందులోని ఆసక్తికర అంశాల్ని కొన్ని ఎంపిక చేసి ఇస్తున్నాం. పీవీ లాంటి మహా మేధావి అవసరం భారత రాజకీయాలకు ఎంత అవసరమన్న విషయంతో పాటు.. దార్శనికుడు అన్న పదానికి పీవీ ఎంతలా సూట్ అవుతారో ఇట్టే అర్థమవుతుంది. ఒక ప్రముఖ పీఠాధిపతిగా ఎంపిక కావాల్సిన వ్యక్తి దేశ ప్రధానిగా ఎంపిక కావటం తెలిసిందే. అలాంటి పీవీకి సంబంధించి ఇంతకాలం మీడియాలో పబ్లిష్ కాని కొన్ని నిజాల్ని సదరు సీనియర్ జర్నలిస్టు పుణ్యమా అని సోషల్ మీడియా కారణంగా బయటకు వచ్చింది. ఇక.. నేరుగా విషయంలోకి వెళితే..
ఇంటర్నెట్ గురించి ఇప్పుడింత చెప్పుకుంటున్నాం. దాని కారణంగా వచ్చి పడే భారీ కంటెంట్ గురించి.. దాని ద్వారా తలెత్తే ఇబ్బందుల గురించి ఇప్పుడు మాట్లాడటం ఓకే. అలాంటిది 1996లో ఇంటర్నెట్ గురించి ఇప్పుడు మాట్లాడినంత వివరంగా మాట్లాడే సత్తా ఒక తెలుగు రాజకీయ నాయకుడికి ఉంటుందా? అంటే నమ్మలేం.కానీ.. పీవీ జీవితంలోని ఒక ఘటనలో ఈ విషయం కనిపించటమే కాదు.. దీని గురించి తెలిసిన తర్వాత అబ్బురంగా అనిపిస్తుంది. అదెలానంటే..
''మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నట్టు పీవీ నరసింహారావు సమైక్యవాది. పుట్టుకతో తెలంగాణ బిడ్డ. అంతకుమించి ప్రాపంచిక దృక్పథం ఉన్న వ్యక్తి. ఆయన్ను కొన్ని సందర్భాల్లో దేశానికే పరిమితం చేయలేం. ఏపీ సీఎంగా భూసంస్కరణలు మొదలుకుని ప్రధానిగా ప్రైవేటీకరణను పరుగులు పెట్టించడం వరకు ఏది తీసుకున్నా ఆయన ఆలోచనలను అద్దం పట్టేవే! ఆయన ప్రధానిగా ఉన్న సందర్భంలోనే తెలుగు దినపత్రిక ''వార్త'' ఆరంభమైంది. ఆయనే దాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హైదరబాద్ రవీంద్రభారతిలో కార్యక్రమం జరిగింది. ఇంటర్నెట్ దూసుకు వస్తోంది, పెద్ద ఎత్తున సమాచారం అందులో పోగుపడి ఉంటుంది. అందులోనుంచి మంచి, చెడు వేరు చేసి తీసుకోవడానికే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ దినపత్రికలకు దీటుగా అందులో సమాచారం ఉంటుందని పీవీ చెప్పారు. అప్పట్లో అంతంత మాత్రమే చాలా మందికి ఇంటర్నెట్ తెలిసిన రోజులవి. శుభమా అంటూ పేపర్ ప్రారంభించి ఈ శాపనార్ధాలు ఏమిటి చెప్మా అనుకున్నాను అప్పట్లో. ఇవాళ అదే నిజమైంది''
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి చెందిన పెద్ద నాయకుడికి వేరే ప్రాంతానికి చెందిన మరో నాయకుడు శిష్యుడిగా ఉండటమే కాదు. వారి మీద అభిమానం ఎంతో ఎక్కువగా ఉండేది. కేంద్రమంత్రి హోదాలో ఉండి కూడా స్నేహితుడి కోసం.. తాను అభిమానించే వారు అకాల మరణం చెందితే.. మిగిలినపనులన్ని ఆపుకొని అంత్యక్రియలకు హాజరుకావటం లాంటి వాటికి పీవీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ వివరాల్లోకి వెళితే..
''పీవీకి ఆంధ్రా ప్రాంతంలోనూ మంచి స్నేహితులు ఉండేవారు. గౌతులచ్చన్నకు వ్యతిరేకంగా ఉండే మజ్జి తులసీదాసును పీవీ ఎంతో ప్రోత్సహించారు. 'జై ఆంధ్ర' ఉద్యమ సారధుల్లో గౌతు లచ్చన్న ఒకరు కాగా, ఆయనతో ఉండే వైరంతో మజ్జి తులసీదాసు పీవీ వైపు చేరారు. అందుకే పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో మజ్జి తులసీదాస్ ఏకంగా పీసీసీ అధ్యక్షుడయ్యారు. తులసీదాసు మరణిస్తే ఆయన కూతురు మజ్జిశారదకు శాసనమండలి సభ్యత్వం ఇప్పించారు. ఆమె మాకు శ్రీకాకుళం ఆర్ట్సకాలేజీలో జూనియర్''
''పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నాయకుడు పరకాల శేషావతారం పీవీకి ప్రియ శిష్యుడు. ఆయన చనిపోయినప్పుడు పీవీ కేంద్ర మంత్రి. ఢిల్లీ నుంచి నేరుగా నరసాపురం హెలికాప్టర్లో వచ్చి మరీ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన కుమారుడే పరకాల ప్రభాకర్''
''విజయవాడలో కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ వారి అంత్యక్రియల్లో ఏకంగా భౌతికకాయాన్ని ఉంచిన వాహనంలోనే ఎక్కి పీవీ కూర్చున్నారు. ఆయన రామాయణ కల్పవృక్షాన్ని హిందీలోకి అనువదించిన సంగతి తెలిసిందే''
రాజకీయంగా ఇబ్బందులు పెట్టిన వారిని నామరూపాల్లేకుండా చేయటం ఇప్పటి కాలంలో చూస్తుంటాం. మరి.. పీవీ మార్కు వేరుగా ఉండేది. ఆ విశేషాల్లోకి వెళితే..
''పీవీ ఉచ్ఛదశలో ఉన్నప్పుడు ఆయన ప్రాంతమైన తెలంగాణ ఆయన్ను ఆదుకోలేదు. అందుకే ప్రధానిగా ఆయన్ను నంద్యాల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. మహరాష్ట్రలోని రామ్‌టెక్ నుంచి గెలిచి రాజీవ్ మంత్రివర్గంలో చేరాల్సి వచ్చింది. ఆఖరుకు తెలంగాణ ఇవ్వని ఇందిరాగాంధీని మెదక్ నుంచి గెలిపించారు తప్ప ప్రధానిగా ఉన్న పీవీకి మాత్రం సొంత ప్రాంతంనుంచి గెలిచే అవకాశం దక్కలేదు. ఆయన ప్రధానిగా ఉన్న రోజుల్లో ఏ తెలుగువాడూ పట్టుమని ఒక ప్రాజెక్టు కోసం పాటుపడింది లేదు. ఆయన తనను గెలిపించిన నంద్యాల నుంచి రాయలసీమకు రైల్వేలైన్ వేయించారు. తనకోసం సీటు త్యాగం చేసిన గంగుల ప్రతాపరెడ్డిని రాజ్యసభకు పంపారు. తనను ఇబ్బంది పెట్టినప్పటికీ బ్రహ్మానందరెడ్డికి మహరాష్ట్ర గవర్నర్ పదవిని ఇచ్చిన ఘనుడు పీవీ''
''కేంద్రంలో జనతా గెలిచినప్పటికీ ఏపీలో ఇందిరమ్మకు తిరుగులేకపోయింది. అప్పట్లో ఆమె వెంట ఉన్న సీనియర్ నేత పీవీ. కావాలనుకుంటే చెన్నారెడ్డికి బదులు ఉమ్మడి ఏపీకి పీవీ సీఎం అయ్యేవారేమో. అయినప్పటికీ పీవీ కేంద్రానికే పరిమితమయ్యారు. సీఎం పదవిని ఆశించలేదు. తదుపరి రెండేళ్ళకు ఇందిరమ్మ మంత్రివర్గంలో చేరారు. అలా ప్రధాని వరకు తన పయనం కొనసాగించారు''
పీవీ దార్శనికుడు అన్నదెంత నిజమన్న దానికి ఈ పోస్టులో ప్రస్తావించిన అంశాలు చెప్పేస్తాయి. అంతేకాదు.. ఆయన ఎంతటి సున్నిత మనస్కుడో చెప్పే ఉదాహరణ ఒకటి ఉంది.
''పీవీ ప్రధాని పదవి చేపట్టే నాటికి ప్రపంచంలో కొనసాగుతున్న పరిస్థితికి అద్దంపట్టేలా చర్యలు తీసుకున్నారు. అంతే తప్ప ఒక రాష్ట్ర నాయకుడు లేదంటే భారత నాయకుడిగా ఆలోచించలేదు. ఐరాసకు వెళ్ళే బృందంలో ప్రతిపక్ష నేత వాజ్ పేయ్ ను పంపడం నుంచి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం అప్పట్లో సంచలనమే. సోషలిజం అని సంకల్పం చెప్పకొన్న భారత దేశ రూపురేఖలు మార్చేశారు. మౌనం కూడా ఒక నిర్ణయమే అనడమే కాదు, ఆచరణలోనూ మనకు అదే చూపించారు. అదే విధంగా పోఖ్రాన్ వద్ద అన్ని హంగులు సమకూర్చటం అంటే మాటలా చెప్పండి. దాని ఫలం వాజపేయ్ అందుకున్నా తానేమీ ఇబ్బందిపడకపోవడంలోనే ఆయన గొప్పతనం ఉంది''
''దేశీ, విదేశీ భాషలపై ఆయన ప్రేమ అచంచలం. నేను నీ కవితలు చదవడం తప్ప, నీవు నా రాతలు చదవవా అని జయప్రభను అడిగేవారట. ఆమే ఒక సందర్భంలో ఈ విషయం చెప్పారు. అంత సున్నిత హృదయుడు ఆయన. పీవీ మరణించిన తరవాత తను పడుకున్న దుప్పటిని తీసేస్తుంటే, స్వదస్తూరితో రాసుకున్న ఆయన కవిత ఒకటి లభించింది. ఆయన సాహిత్య పిపాసి అనడానికి అంతకంటే ఉదాహరణలు ఇంకేమి చెప్పగలం. పీవీని ఒక చట్రంలో పెట్టేయలేమనడానికి ఇంతకుమించి ఉదాహరణలు అవసరమంటారా?''
పీవీ - అమరావతి.. అదెలానంటే?
''ఉమ్మడి రాష్ట్రానికి పీవీ నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రజల పక్షాన ఉండాలన్న తలంపుతో పీవీ కేబినెట్‌లోని పదిహేను మంది ఆంధ్రా మంత్రుల్లో బీవీ సుబ్బారెడ్డి, కాకాని వెంకటరత్నం సహా పది మంది పదవులకు గుడ్‌బై చెప్పారు. లుకలాపు లక్ష్మణదాసు, భాట్టం శ్రీరామమూర్తి, మండలి వెంకటకృష్ణారావు , అనగాని భగవంతరావు సహా ఆరుగురు పీవీ పక్కన మిగిలారు. తదుపరి రోజుల్లో అంటే 1972 డిసెంబర్ 24న విజయవాడలో ఉద్యమకారులతో జరిగిన ఘర్షణ లాఠీచార్జ్, కాల్పులకు దారితీసింది. ముగ్గురు మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు. మరుసటి రోజంతా పట్టణమంతా తిరిగిన కాకాని వెంకటరత్నం - నా పిల్లలను చంపేస్తున్నార్రా - అంటూ బావురుమన్నారు. అదే రోజు రాత్రి గుండెపోటుతో మరణించారు. విజయవాడ సహా ఆంధ్రా ప్రాంతమంతా భగ్గుమంది''
''రాజీనామాకు ముందు వరకు తన కేబినెట్ సహచరుడు, శాసనసభ్యుడు కాకాని మృతదేహాన్ని చూడటానికి ముఖ్యమంత్రిగా పీవీ బయలుదేరారు. పీవీ వెళితే శాంతిభద్రతలకు విఘాతమని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చెప్పారు. వెళ్ళి తీరాల్సిందేనని పీవీ పట్టుబట్టారు. కుదరదని ప్రధాన కార్యదర్శి గట్టిగా చెప్పారు. నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోండి అని పీవీ కస్సుమన్నారు. విజయవాడ వెళ్ళేందుకు సన్నద్ధమై తన కారు వద్దకు వెళ్ళారు. డ్రైవరు కారు ఎక్కలేదు. కారు తీయమని పీవీ ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి తనను తీసుకువెళ్ళవద్దని అన్నారని డ్రైవరు సవినయంగా సమాధానం చెప్పారు. అరికాలి మంట తలకెక్కిన పీవీ, కోపం పట్టలేక విసురుగా తన ఛాంబర్లోకి వెళ్ళి ప్రధాన కార్యదర్శిని పిలిపించారు. మీరు చెప్పినట్టే నా పని నేను చేశాను... నాకు సీఎం భద్రత ముఖ్యం అని చాలా వినయంగా చెప్పారు. అదే ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి వారే ఊహించుకోండి''
''మరుసటి రోజు కాకాని మృతదేహానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. చోటా, మోటా నాయకులంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కాకాని అమర్ రహే అంటూ కృష్ణమ్మ నది ఒడ్డున ఉద్యమకారులు నినదించారు. తరవాత స్నానాదికాలు ముగించుకున్న నాయకులు భీషణ ప్రతిజ్ఞ ఒకటి చేశారు. ఆంధ్రా అంటూ ఏర్పడితే ఇక్కడే మా రాజధాని అని సంకల్పం చెప్పకొన్నారు. హిందీ పండితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒక పుస్తకావిష్కరణలో ఈ విషయం చెప్పారు. ఏపీ విభజన అనంతరం చాలా రోజులకు జరిగిన సభ అది. అమరావతి ప్రారంభోత్సవానికి ఎలా వెళ్ళావయ్యా అని ఎవరో ఆయన్ను అడిగితే పై కథంతా చెప్పుకొచ్చారట. అప్పట్లో ప్రతిజ్ఞ చేసిన యువనాయకుల్లో తానూ ఒకడినని వివరించారు. రాజధాని ఎక్కడ అంటే స్మశానంలో అని ఇందిరమ్మకు చెప్పానని గౌతు లచ్చన్న గారు కూడా ఒక సభలో చెప్పారు. ఆ స్మశానమే అమరావతి''
''అసలు ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయేముందు రాజధాని ఎక్కడ అని అసెంబ్లీలో చర్చ జరిగింది. నాలుగు తీర్మానాల్లో ఒకటి వావిలాల గోపాలకృష్ణయ్య గారిది. విజయవాడ - గుంటూరు మధ్యలో అంటే ఇప్పటి అమరావతి అనుకోవచ్చు. అక్కడ రాజధాని ఉండాలన్న తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అదే జరిగితే అక్కడ బలంగా ఉన్న కమ్యూనిస్టులతో ఇబ్బంది వస్తుందని కొందరు నేతలు తలపోశారు. ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని తమిళ ప్రాంత ఎమ్మెల్యేలను అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ కోరారు. అయినా వారిలో కొందరి సహకారంతో ఆ తీర్మానం వీగిపోయేలా చేశారు. గిరిజన ఎమ్మెల్యే ప్రతిపాదించిన విశాఖ, గౌతులచ్చన్న సూచించిన తిరుపతి, వావిలా తీర్మానం తిరస్కారానికి గురయ్యాయి. చివరాఖరుకు నాలుగో తీర్మానంగా కర్నూలు రాజధానిగా ఖరారు అయ్యింది. ఇలా అమరావతి కథలో పీవీ పరోక్షపాత్ర ఎన్నడో వహించారు''