Begin typing your search above and press return to search.

‘పీవీ సింధు ఒలింపిక్ చీర లాంటివి ముంబైలో రూ.200’... ఏమిటీ వివాదం?

ప్రపంచ క్రీడా సంబరం ఒలింపిక్ శుక్రవారం (జూలై 26)న పారిస్ లో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   27 July 2024 3:24 PM GMT
‘పీవీ సింధు ఒలింపిక్ చీర లాంటివి ముంబైలో రూ.200’... ఏమిటీ వివాదం?
X

ప్రపంచ క్రీడా సంబరం ఒలింపిక్ శుక్రవారం (జూలై 26)న పారిస్ లో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలను చూడటానికి, ఈ క్రీడలను ఆస్వాధించడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాభిమానులు ఫ్రాన్స్ చేరుకుని, పారిస్ వీధుల్లో సందడి చేస్తున్నారు. ఈ సమయంలో భారత్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించింది.

ఇందులో భాగంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఫ్లా బేరర్ గా అరుదైన గౌరవం దక్కింది. ఈ సమయంలో... తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో రూపొందించిన చీరను ధరించి ఆకట్టుకుంది పీవీ సింధు. ఇదే సమయంలో... త్రివర్ణ పతాకం చేపట్టి భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహించింది.

దీనికి సంబంధించిన సంతోషాన్ని సింధూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఆమె ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇదంతా ఒకెత్తు అయితే... ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో సింధూ ధరించిన చీరపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా... "భారతీయ బృందం కోసం ఈ దుస్తులను రూపొందించిన వారు ఆస్కార్, నోబుల్ బహుమతికి అర్హులు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో... ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఈ దుస్తులపై కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ నందితా అయ్యర్ సంచలన కామెంట్స్ చేశారు. "తరుణ్ తహిలియానీ... మీరు డిజైన్ చేసిన ఈ వేడుకల యూనిఫాం ల కన్నా బెటర్ చీరలు ముంబై వీధుల్లో రూ.200లకు నేను చూశాను. మీ డిజైన్... భారతదేశ సుసంపన్నమైన చేనేత సంస్కృతికి, చరిత్రకు ఘోర అవమానం" అని అన్నారు.

ఇదే క్రమంలో... “ఒరిజినల్ టెక్స్‌ టైల్ ఫ్యాబ్రిక్‌ లకు పుట్టినిల్లు భారత్, డిజిటల్ ప్రింట్లు ధరించి ఒలింపిక్స్‌ కు అథ్లెట్లను పంపారు! మన స్వంత బలాన్ని ప్రపంచానికి ఇలా ప్రదర్శిస్తామా? ఎంత అవమానం!?” అంటూ నెట్టింట మరో కామెంట్ దర్శనమిచ్చింది! కాగా... పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియానీ.. భారత అథ్లెట్ల కోసం దుస్తులను రూపొందించారు. ఇప్పుడు ఈ దుస్తులపైనే విమర్శలు వస్తున్నాయి.