Begin typing your search above and press return to search.

పా.. పా.. పాము.. దాన్ని పట్టేయ్.. రూ.20 లక్షలు ప్రైజ్ కొట్టేయ్

ఇక్కడ ఫ్లోరాడా పైతాన్ చాలెం అంటూ పోటీలు నిర్వహిస్తుండం వింత గొలుపుతోంది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 5:30 PM GMT
పా.. పా.. పాము.. దాన్ని పట్టేయ్.. రూ.20 లక్షలు ప్రైజ్ కొట్టేయ్
X

పాములంటే అందరికీ భయమే.. అయితే, పాములన్నీ భయంకరమైనవి కాదు.. మొత్తం జాతుల్లో నాలుగైదు మాత్రమే విషపూరితం అని నిపుణులు చెబుతుంటారు. కానీ.. మనుషులకు మాత్రం భయం పోవడం లేదు. పాము కరిచిన విషం కంటే.. అది కరిచిందన్న భయమే ప్రాణాలు తీస్తుంది. అందుకే ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటిని పట్టేవారిని పిలుస్తుంటారు. అమెరికాలో మాత్రం.. పట్టుకుంటే పదివేలు అన్నట్లు.. పామును పట్టేయ్ రూ.20 లక్సలు ప్రైజ్ మనీ కొట్టేయ్ అంటున్నారు. దీనికోసం ఓ పోటీనీ నిర్వహిస్తుండడం గమనార్హం.

పొడవు.. సంఖ్య..

అమెరికాలోని సముద్ర తీర రాష్ట్రాల్లో ఫ్లోరిడా ఒకటి. ఇక్కడ ఫ్లోరాడా పైతాన్ చాలెం అంటూ పోటీలు నిర్వహిస్తుండం వింత గొలుపుతోంది. ఎవరు ఎక్కువ లేదా పెద్ద సైజు పాములను పడితే వారికి రూ.లక్షల్లో ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. అయితే, ఈ పోటీలు ఏడాదిలో పదిరోజులే ఉంటాయి. దీని వెనుక పెద్ద ఉద్దేశమే ఉంది. పాములు పట్టే పోటీలను ఫ్లోరిడా ఫిష్‌ అండ్ వైల్డ్‌ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌ (ఎఫ్ డబ్ల్యూసీ) నిర్వహిస్తుంటుంది. అది కూడా ఈ నెలలోనే. అంటే ఆగస్టులో. ఇప్పటికే గత వారం (9వ తేదీన) పోటీలు మొదలయ్యాయి. 18వ తేదీతో ముగియనున్నాయి.

జరిగేది ఎక్కడంటే..

ఫ్లోరిడాలోని ఎవర్‌ గ్లేడ్స్‌ ప్రాంతం బర్మీస్‌ పైతాన్‌ లకు పేరొందింది. ఇక్కడ ఒక్కోటి 18 అడుగుల పొడవు, 200 పౌండ్ల బరువుంటాయి. 2000 సంవత్సరంలో ఎవర్‌ గ్లేడ్స్ నేషనల్ పార్క్‌ లో తొలిసారి వీటిని గుర్తించారు. ఎలా చేరాయనేదానిపై స్పష్టత లేదు. అప్పటినుంచి ఇబ్బడి ముబ్బడిగా పిల్లలను పెట్టేశాయి. ఇక ఆడ పైతాన్‌ ఒకేసారి 100 గుడ్లు పెడుతుంది. దీనికి ఎవర్‌ గ్లేడ్స్‌ తేమ- ఉష్ణమండల ప్రాంతం బాగా అనువుగా మారింది. అలా అలా.. పైతాన్ లు దక్షిణ ఫ్లోరిడా వరకు విస్తరించాయి. ఇంకేముంది? జీవ వైవిధ్యం దెబ్బతింటోంది.

పర్యావరణ సంక్షోభాన్ని నివారించేందుకు..

పైతాన్ ల సంతతి పెరిగిపోత పర్యావరణ సంక్షోభం తప్పదని ప్రభుత్వం గుర్తించింది. దీంతోనే ‘ఫ్లోరిడా పైతాన్ చాలెంజ్‌’ తీసుకొచ్చింది. అందుకోసం పోటీలు పెడుతోంది. అయితే, పాల్గొనేవారు పైతాన్ లను హింసించకుండానే చంపేయాలి. ఈ మేరకు ట్రైనింగ్ కూడా ఉంటుంది.

పైతాన్ హంటింగ్ పోటీలను అనుభవం లేనివారు, నిపుణులు, మిలటరీ.. ఇలా మూడు కేటగిరీల్లో నిర్వహిస్తున్నారు.

ఎక్కువ పైతాన్లు పట్టుకున్న వ్యక్తికి 10 వేల డాలర్ల వరకు ఇస్తారు. 25 వేల డాలర్ల వరకు వివిధ కేటగిరీల్లో బహుమతులు ఇస్తారు. నిరుడు జరిగిన పోటీల్లో 209 పైతాన్‌ లను చంపివేశారు. కాగా, మనకు ఆగస్టు వర్షాకాలం అయితే.. ఫ్లోరిడాలో ఎండాకాలం. ఈ సమయంలో పైతాన్ లు సూర్యాస్తమయం తర్వాత చురుగ్గా ఉంటాయి. అప్పుడు గుర్తించడం తేలిక.