Begin typing your search above and press return to search.

బాస్ కి చెప్పకుండా లీవ్ పెడితే... ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా?

అవును... పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమో, మరో కారణంతోనో ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్ ని అడగటం లేదంట.

By:  Tupaki Desk   |   25 May 2024 7:50 AM GMT
బాస్  కి చెప్పకుండా లీవ్  పెడితే... ఈ కొత్త ట్రెండ్  గురించి తెలుసా?
X

టెక్ ప్రపంచంలో నిత్యం ఏదో ఒక అంశం ట్రెండింగ్ లో ఉంటుంటుంది. ఇది ప్రధానంగా ఐటీ ఉద్యోగులు - కంపెనీ మధ్య ఉంటుండటం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా కొత్త ట్రెండ్ ఒకటి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం యువత ఈ ట్రెండ్ ను ఎక్కువగా ఫాలో అవుతుందని చెబుతున్నారు. దానిపేరే... "క్విట్ వెకేషనింగ్" ట్రెండ్! ఈ కథాకమీషేమిటో ఇప్పుడు చూద్దాం...!

సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగానికి, పర్సనల్ లైఫ్ కీ మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు పని నుండి కాస్త విరామం తీసుకుని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఇది అత్యంత సాధారణమైన విషయం. ఈ రిలాక్సేషన్ కోసం ఆఫీసులోని బాస్‌ కు చెప్పి సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్రెండ్‌ మొదలయ్యింది.

అవును... పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమో, మరో కారణంతోనో ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్ ని అడగటం లేదంట. తాజాగా అమెరికన్ మార్కెటింగ్ అండ్‌ రీసెర్చ్ కంపెనీ "హారిస్ పోల్" నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. యూఎస్‌ లో సుమారు 78 శాతం మంది ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్‌ ను అడగడం లేదట.

ఇలా బాస్ ని అడగకుండా లీవ్‌ పెట్టడాన్ని వారు తప్పుగా భావించడంలేదని.. పని ఒత్తిడికి తగ్గించుకునేందుకే వారు ఇలా చేస్తున్నారని సర్వే వెల్లడించింది. ఇదే సమయంలో... పని నుంచి విరామం కోరుకునేందుకు ఉద్యోగులు తమకు తోచిన పరిష్కారాలను కనిపెడుతున్నారని.. ఇందులో భాగంగానే క్విట్‌ వెకేషనింగ్‌ ‌ అనేది ఉద్భవించిందని సర్వే చెబుతోంది.

ఇందులో భాగంగా... క్విట్‌ వెకేషనింగ్‌ ‌‌ సమయంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్నట్లు సంస్థకు భ్రమ కల్పిస్తారట.. పని వేళల్లో తాము పంపాల్సిన ఈమెయిల్స్‌ ను ముందుగానే షెడ్యూల్ చేస్తారని చెబుతున్నారు. మరి కొంతమంది ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కంప్యూటర్ మౌస్‌ ను కంపెనీ మెసేజింగ్ ప్లాట్‌ ఫారమ్‌ పై ఉంచి, పని చేస్తున్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తారని సర్వే సంస్థ చెబుతుంది.