మోడీ చెంతకు కృష్ణయ్య.. కండిషన్స్ అప్లయ్!
రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అవకాశం-అవసరం అనే రెండు పట్టాలపై ప్రయాణించే రాజకీయాల్లో ఏది జరిగినా ఆశ్చర్యం లేదు.
By: Tupaki Desk | 3 Dec 2024 4:41 AM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అవకాశం-అవసరం అనే రెండు పట్టాలపై ప్రయాణించే రాజకీయాల్లో ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. నిన్న మొన్నటి వరకు తిట్టిపోసిన నాయకులే.. అవకాశం ఇస్తామంటే ముగ్ధులవుతారు. మురిపెం చూపిస్తారు. నిన్న మొన్నటి వరకు భుజాలకెత్తుకున్న నాయకులు కూడా.. అవసరం తీరగానే భారమవుతారు. ఇది రాజకీయం! ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. నిన్నటి వరకు మోడీపై నిప్పులు చెరిగిన బీసీ సంఘం నాయకుడు.. ఆర్. కృష్ణయ్య తాజాగా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతుండడమే. బీసీ ఉద్యమాలతో ప్రస్థానం ప్రారంభించిన ఆర్. కృష్ణయ్యకు 30 ఏళ్ల చరిత్ర ఉంది.
బీసీలను ఏకం చేయడంతోపాటు.. ప్రభుత్వాలపై ఆయన ఉద్యమించారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి వరకు కూడా.. ఆయన ఉద్యమాలు కొనసాగాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో ఆయన రాజకీయాల బాటపట్టారు. 2014లో టీడీపీ తరఫున తెలంగాణలోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. ఆయన తటస్థ పాత్ర పోషించారు. చంద్రబాబు ఎవరో కూడా తెలియనట్టుగా వ్యవహరించారు.
దీనికి కారణం.. తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోపాటు కేసీఆర్‌తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలను తెరచాటున మెరుగు పరుచుకున్నారనే వాదన కూడా వినిపించింది. ఇక, 2019లో అదే కేసీఆర్ సూచనల మేరకు టీడీపీని దెబ్బ కొట్టేందుకు ఏపీలో జగన్‌తో చేతులు కలిపారన్న చర్చ కూడా ఉంది. బీసీ ఓటు బ్యాంకును వైసీపీకి చేరువ చేయడంలో ఆయన 2019 ఎన్నికల్లో ఆర్ .కృష్ణయ్య తెరచాటున మంత్రాంగం నడిపారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత.. జగన్ ఆయనకు రాజ్యసభ సీటును కట్టబెట్టారు. ఇక, జగన్ అదికారం పోవడంతో ఆ వెంటనే రాజ్యసభకు రాజీనామా చేశారు కృష్ణయ్య.
ఇక, ఇప్పుడు జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్ కృష్ణయ్య చూపు బీజేపీపై ఉందని తెలుస్తోంది. బీజేపీకి కూడా కృష్ణయ్య వంటి బలమైన బీసీ నేతను చేర్చుకుంటే.. తెలంగాణలో అధికారం దక్కించుకోవడం ఈజీ అవుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు ఆయన, ఇటు బీజేపీ కూడా కలిసిప్రయాణించేందుకు రంగం రెడీ అవుతోందని తెలుస్తోంది. అయితే.. తాను వదులుకున్న రాజ్యసభ స్థానాన్ని తిరిగి తనకు అప్పగించాలన్నది కృష్ణయ్య షరతుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బీజేపీ కూడా ఓకే అంటే.. ఇద్దరూ చెలిమి చేయడం ఇక, ప్రకటనే తరువాయి అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.