సమీక్షా సమావేశంలో రచ్చ... సిద్ధిపేటలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే!
ఈ సమయంలో జాతరకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో... ఈ జాతర ఏర్పాట్ల సందర్భంగా తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
By: Tupaki Desk | 30 Dec 2023 2:23 PM GMTసిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది అనంతరం ముగిసే కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఈ జాతరకున్న ప్రత్యేకతే వేరు. ఈ సమయంలో జాతరకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో... ఈ జాతర ఏర్పాట్ల సందర్భంగా తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది కాస్తా రచ్చ రచ్చగా మారింది.
అవును... జనవరిలో ప్రారంభమయ్యే కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశం శనివారం సిద్దిపేట హరిత హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొండ సురేఖ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సమయంలో ఆమెతోపాటు కాంగ్రెస్ నాయకులను వేదికపైకి పిలవడంతో ఎమ్మెల్యే పల్లా నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగింది!
వివరాళ్లోకి వెళ్తే... కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిధిగా కొండా సురేఖ పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వేదికపై ఉన్నారు. ఇదే సమయంలో స్థానిక కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కొండా సురేఖ వేదికపైకి ఆహ్వానించారు. దీనిపై పల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఓడిపోయిన వారిని ఎలా వేదికపైకి పిలుస్తారంటూ పల్లా ప్రశ్నించారు. మంత్రిగా ప్రత్యేక ఆహ్వానితులను పిలిచే అధికారం తనకు ఉందని కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో ప్రొటోకాల్ అనేది ఒకటి ఉంటుందంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి లాజిక్ లాగే ప్రయత్నం చేయగా... ఈ సమావేశం కలెక్టర్ ఆఫీసులో జరిగి ఉంటే ప్రోటోకాల్ ఉంటుందని సురేఖ గుర్తుచేశారు!
అనంతరం మీటింగ్ నడవాలా వద్దా అని పల్లా రాజేశ్వర్ రెడ్డిని కొండా సురేఖ సూటిగా ప్రశ్నించారు. అనంతరం... మీకు నచ్చి చేసుకుంటే చేసుకోండని అంటూ.. అధికారుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే పల్లా సమావేశాన్ని బహిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.