Begin typing your search above and press return to search.

'జగన్ సభ్యత్వం రద్దు'పై రఘురామ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు!

మాట్లాడటానికి సమాయం ఇస్తేనే కదా తాము అసెంబ్లీకి వెళ్లేది, సాధారణ ఎమ్మెల్యేలాగానే తనకూ సమయం కేటాయిస్తే ఎలా అని ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   11 Feb 2025 8:00 AM GMT
జగన్  సభ్యత్వం రద్దుపై రఘురామ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ వరుసగా 60 రోజులు అసెంబ్లీకి డుమ్మా కొడితే.. అతని శాసనసభ సభ్యత్వం దానంతట అదే రద్దవుతుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ 60 రోజులు ఎప్పటికి పూర్తవుతాయనే సంగతి కాసేపు పక్కనపెడితే.. మరోసారి ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇటీవల మీడియా సమావేశం పెట్టిన వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరవ్వడంపై స్పందించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని అన్నారు. మాట్లాడటానికి సమాయం ఇస్తేనే కదా తాము అసెంబ్లీకి వెళ్లేది, సాధారణ ఎమ్మెల్యేలాగానే తనకూ సమయం కేటాయిస్తే ఎలా అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకే హోదా ఇవ్వడం లేదని జగన్ తెలిపారు. ఈ విషయంపై తాము ఇప్పటికే కోర్టుకు వెళ్లామని.. అయితే ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోర్టుకు ఎందుకనో స్పందించడం లేదని అన్నారు. ఈ సమయంలో తాజాగా మరోసారి ట్రిపుల్ ఆర్ స్పందించారు.

స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి లోక్ సభ స్పీకర్ ఓ బిర్లాను ఢిల్లీలో కలిసిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో చంద్రబాబుకు ఇచ్చిన సమయం ఇవ్వాలని వైసీపీ నేతలు కోరడం వింతగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీలో 10 శాతం (కనీసం 18 మంది ఎమ్మెల్యేలు) ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని మరోసారి తేల్చి చెప్పారు.

ఇక.. వరుసగా 60 రోజుల పాటు అనుమతి లేకుండా ఎమ్మెల్యే అసెంబ్లీకి డుమ్మా కొడితే అతడి సభ్యత్వం రద్దవుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 190/4లో స్పష్టంగా రాసుందని రఘురామ తెలిపారు. రాజ్యాంగాన్ని అమలుచేస్తూ, చట్టం ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై ఉందని అన్నారు.

అయితే... వైఎస్ జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఈ మేరకు అనుమతి కోర్లేదని అన్నారు. 60 రోజులు దాటిన తర్వాత కూడా సెలవులు కావాల్సి వస్తే సెలవు పొడిగింపు కోరుతూ మరో లేఖ ఇవ్వాలని అన్నారు. అయితే.. ఇప్పటివరకూ జగన్ ఒక్క లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదని రఘురామ తెలిపారు.

దీంతో... ఆ 60 రోజులు అనుమతి లేని సెలవు విషయంపై రఘురామ కృష్ణంరాజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. ఒక వేళ ఆ 11 మంది సభ్యత్వం రద్దు అయితే ఉప ఎన్నికలకు వెళ్లే పరిస్థితిపైనా చర్చ మొదలైందని అంటున్నారు. ఏది ఏమైనా... వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది మాత్రం ముగిసిన అధ్యాయమే అనే విషయం ట్రిపుల్ ఆర్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.