Begin typing your search above and press return to search.

రఘురామ కేసులో కీలక ఆప్డేట్ గుండెలపై కూర్చొన్న వ్యక్తి ఎవరంటే..?

ఏపీ డిప్యూటీ స్పీకర్, గత ప్రభుత్వంలో వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు కేసులో కీలక విషయాన్ని పోలీసులు ఛేదించారు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 8:20 AM GMT
రఘురామ కేసులో కీలక ఆప్డేట్ గుండెలపై కూర్చొన్న వ్యక్తి ఎవరంటే..?
X

ఏపీ డిప్యూటీ స్పీకర్, గత ప్రభుత్వంలో వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు కేసులో కీలక విషయాన్ని పోలీసులు ఛేదించారు. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురిచేశారని సీఐడీ పోలీసులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై రఘురామకృష్ణంరాజు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్ అరెస్టు అయ్యారు.

కస్టోడియల్ టార్చర్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆయన గుండెలపై కూర్చొని అరికాళ్లపై రబ్బరు లాఠీలతో కొట్టిన వ్యక్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న అప్పటి సీఐడీ అధికారులు, సిబ్బందిని ఒకవైపు విచారిస్తున్న పోలీసులు రఘురామ గుండెలపై కూర్చొని పిడిగుద్దులు గుద్దిన ప్రైవేటు వ్యక్తిని గుర్తించినట్లు సమాచారం. నిందితుడిని విచారణకు రమ్మంటూ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.

రఘురామ ఎంపీగా ఉండగా, అప్పటి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి తన అభిప్రాయాలను వెల్లడించేవారు. ఆయనను ఎదుర్కొనే క్రమంలో వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి సీఐడీ ద్వారా రాజద్రోహం కేసు నమోదు చేయించి అరెస్టు చేసింది. అయితే సీఐడీ పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత రఘురామను కస్టడీలో తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రామురామ కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో నరాలు చిట్లిపోయాయి. కోర్టు జోక్యంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తనపై దాడి చేసినట్లు రఘురామ అప్పట్లోనే కేసు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమారు కేసు పెట్టడంతో అరెస్టులు మొదలయ్యాయి.

రఘురామ కస్టడీలో ఉండగా కొందరు ముసుగులు వేసుకుని వచ్చి తీవ్రంగా కొట్టినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక బరువైన వ్యక్తి తన గుండెలపై కూర్చొని పిడిగుద్దుల వర్షం కురిపించినట్లు రఘురామ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారించిన పోలీసులు కేసుతో సంబంధం ఉన్నవారిని పిలిచి విచారించారు. ఇందులో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిలో ఒకరు గుడివాడకు చెందిన కామేపల్లి తులసీగా రఘురామ గుర్తించారు. దీంతో నిందితుడిని విచారణకు రమ్మంటూ ప్రకాశం ఎప్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు.