Begin typing your search above and press return to search.

జగన్ కి భారీ ఆఫర్ ఇచ్చిన ట్రిపుల్ ఆర్!

జగన్ కనుక అసెంబ్లీకి వస్తే ఆయనకు ఎటువంటి అవమానం జరగకుండా తాను చూసుకుంటాను అని ఒక భారీ ఆఫర్ కూడా ఇచ్చారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 4:07 AM GMT
జగన్ కి భారీ ఆఫర్ ఇచ్చిన ట్రిపుల్ ఆర్!
X

వైసీపీలో రెబెల్ ఎంపీగా నాలుగున్నరేళ్ల పాటు పోరాడిన రఘురామ క్రిష్ణం రాజు ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప సభాపతిగా అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. ఆయన ఉన్నతమైన రాజ్యంగ పదవిలో ఉన్నారు. ఈ పదవిలో ఆయన ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు.

లేటెస్ట్ గా ఆయన ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ విషయం గురించి మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి రావాలని మరోమారు కోరారు. జగన్ కనుక అసెంబ్లీకి వస్తే ఆయనకు ఎటువంటి అవమానం జరగకుండా తాను చూసుకుంటాను అని ఒక భారీ ఆఫర్ కూడా ఇచ్చారు.

సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షమూ అవసరమేనని ఆయన అన్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన ప్రమాణా స్వీకారానికి వచ్చిన రోజే వెళ్ళి చెప్పాను అని గుర్తు చేశారు. ఇక పోతే జగన్ అసెంబ్లీకి రావాలని అందరూ కోరుకుంటున్నారు అని రఘురామ అన్నారు.

జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు తగినంత సమయం ఇస్తామని అన్నారు. తనకు తగిన సమయం ఇవ్వరేమో అన్నది జగన్ ఆలోచన అయితే మాత్రం ఆయన సభకు వస్తేనే కదా తెలిసేది అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఒక పార్టీకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా అన్నది రాజ్యాంగంలో ఎక్కడా లేదని అదే సమయంలో అలాంటి నిబంధన లేనపుడు ఆనవాయితీని ఆచరించవలసి ఉంటుందని కూడా ఉందని అన్నారు.

ఇది ఈ రోజుది కాదని 1950 దశకం తొలి రోజులలో లొక్ సభ స్పీకర్ హుకుం సింగ్ టైం లో ఈ ఆనవాయితీని పెట్టారని అన్నారు. సభ అంటే కోరం ఉండాలి కాబట్టి కనీసం పదవ వంతు అయినా ఉండాలన్నది ఒక విధానంగా ఉందని, అదే చివరికి ఆనవాయితీగా మారిందని అన్నారు. రెండు సార్లు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా కూడా ఈ ఆనవాయితీ ప్రకారమే దక్కలేదని గుర్తు చేశారు.

దేశంలో గుజరాత్, అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాలలఒ కూడా లీడర్ ఆఫ్ అపొజిషన్ లేడని ఆయన అన్నారు. లేని సంప్రదాయం ఏపీలో తెచ్చి తనకు కావాలని జగన్ కోరడం మంచిది కాదని అన్నారు. అయితే జగన్ అసెంబ్లీకి వస్తే కచ్చితంగా ఆయనకు తగినంత సమయం ఇచ్చే విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కానీ తాను కానీ కచ్చితంగా చూస్తామని ట్రిపుల్ ఆర్ హామీ ఇచ్చారు.

ప్రశ్నోత్తరాల నుంచి కూడా జగన్ కి తగినంత సమయం మాట్లాడేందుకు ఉంటుందని అన్నారు. జగన్ వచ్చే బడ్జెట్ సెషన్ కి అయినా సభకు వస్తారని రావాలని ఆశిస్తున్నామని రఘురామ అన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీ కోర్టుకు వెళ్ళిందని కానీ అది స్పీకర్ పరిధిలోని అంశంగానే తాను భావిస్తున్నానని అన్నారు. స్పీకర్ విచక్షణ మేరకే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కూడా గత సంప్రదాయం ప్రకారమే అనుసరిస్తారని అంటున్నారు.

తాను డిప్యూటీ స్పీకర్ గా ఉండడం ఆయనకు రుచిందదేమో అన్న యాంకర్ ప్రశ్నకు రఘురామ బదులిస్తూ నేను వైసీపీ ప్రభుత్వంతో దెబ్బ తిన్నా కూడా నా అంతట నేనే ఆయన వద్దకు వెళ్ళి సభకు రావాలని కోరాను అని గుర్తు చేశారు. డిప్యూటీ స్పీకర్ గా తనకు అన్ని పార్టీలూ ఎమ్మెల్యేలను గౌరవించడం విధి అని అన్నారు. ఒక ఎమ్మెల్యేగా జగన్ కి గౌరవమే సభలో ఇస్తారు తప్ప వేరే విధంగా కించపరచేది ఉండదని రఘురామ అన్నారు.