'అల్లు అర్జున్ ది చాలా చిన్న కేసు'... 'అందుకే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారు'!
ఈ సమయంలో ఈ వ్యవహారంపై బీఆరెస్స్ నేతలు రేవంత్ సర్కార్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 24 Dec 2024 8:05 AM GMT‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు తీవ్ర స్థాయిలో రాజకీయ రంగు పులుముకుందనే చర్చ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ వ్యవహారంపై బీఆరెస్స్ నేతలు రేవంత్ సర్కార్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. నేడు మరోసారి పోలీసులు అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లి సీన్ రీ కనస్ట్రక్షన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... అల్లు అర్జున్ ది చాలా చిన్న కేసు అని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.
తాజాగా ఈ ఘటనపై స్పందించిన రఘునందన రావు... అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని.. భద్రతా వైఫల్యం ఉన్న ఇషయాన్ని పక్కనపెట్టి, హీరోని మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతోందని అన్నారు. ఈ క్రమంలో.. ఒక తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందని బీజేపీ ఎంపీ ఆరోపించారు.
ఇదే సమయంలో... అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీడియోలు ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం కక్ష గట్టినట్లూ ప్రవర్తించడం సరికాదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.
మరోపక్క ఇదే వ్యవహారంపై స్పందించిన బీజేపీ నాయకురాలు డీకే ఆరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. రేవతి మరణం అత్యంత బాధాకరమని చెబుతూ.. బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... తన రాజకీయాలకోసం అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని.. సంధ్య థియేటర్ సంఘటనను ఈ విధంగా తన రాజకీయాలకు వాడుకోవడం సరైంది కాదని.. సినిమా హీరోలా, రాజకీయ నాయకులా అనే సంగతి పక్కనపెడితే.. అసలు ఇలా రాజకీయాలు చేయడమే సరైంది కాదని అరుణ తెలిపారు.
మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని చెప్పిన అరుణ... సీఎం కాకముందు రేవంత్ రెడ్డి బౌన్సర్స్ లేకుండా బయటకు వెళ్లారా అని అడిగారు. ఏది ఏమైనా.. అల్లు అర్జున్ పట్ల పోలీసుల తీరు సరైంది కాదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలూ గాడి తప్పాయని.. డీకే అరుణ మండిపడ్డారు.
ప్రధానంగా... రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని.. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం, అతని ఇంటిపైనా దాడి చేయడం.. ఇవన్నీ కక్ష సాధింపు రాజకీయలే అని డీకే అరుణ తెలిపారు.